మూడు జల విద్యుత్ కేంద్రాలకు అవార్డులు
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:37 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మూడు జల విద్యుత్ కేంద్రాలకు ఉత్తమ అవార్డులు లభించాయని ఏపీ జెన్‌కో హైడల్ డైరెక్టర్ సుజయ్‌కుమార్ తెలిపారు.
ఉత్తమ పని తీరు కనబరచడంతో పొల్లూరు, డొంకరాయి, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాలు ఎంపిక
ఏపీ జెన్‌కో హైడల్ డైరెక్టర్ సుజయ్‌కుమార్
సీలేరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మూడు జల విద్యుత్ కేంద్రాలకు ఉత్తమ అవార్డులు లభించాయని ఏపీ జెన్‌కో హైడల్ డైరెక్టర్ సుజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రం, డొంకరాయి జల విద్యుత్ కేంద్రం, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాలు ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యాయన్నారు. పొల్లూరు, డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలకు డొంకరాయి పవర్ కెనాల్ పనులు నిర్దేశించిన సమయం కంటే ముందుగా మెరుగైన పనులు చేపట్టడంతో పాటు ఈ రెండు జల విద్యుత్ కేంద్రాల్లో ఫుల్‌లోడ్ అవర్స్‌లో విద్యుదుత్పత్తిని చేసినందుకు గాను ఉత్తమ పనితీరు ప్లాంట్ అవార్డులను దక్కించుకోగా, విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని అనుకున్న సమయానికి ముందుగానే చేరుకున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం కూడా ఉత్తమ పనితీరు ప్లాంట్ అవార్డుకు ఎంపికైందని ఆయన చెప్పారు. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం 2025- 2026 ఆర్థిక సంవత్సరం లక్ష్యం 657 మిలియన్ యూనిట్లు కాగా, ఈ నెల 22 నాటికే లక్ష్యాన్ని చేరుకుందన్నారు. మాచ్‌ఖండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని రెండు నెలల ముందుగానే చేరుకుందన్నారు. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని యూనిట్లు సక్రమంగా పని చేస్తుండడంతో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. డొంకరాయి పవర్ కెనాల్ నిర్వహణ పనులకు రెండు నెలలు ఎల్‌సీ ట్రాన్స్‌కో అధికారులు మంజూరు చేస్తే సీలేరు కాంప్లెక్సులోని అధికారులు, కార్మికుల సమష్టి కృషి ఫలితంగా నెల రోజుల్లోనే పనులు పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో ఆధ్వర్యం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు రెండవ దశలోని 5, 6 యూనిట్ల పనులు శరవేగంగా చేపడుతున్నామన్నారు. ఈ ఏడాదిలో రెండు యూనిట్లను వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.