Share News

అదుపు తప్పి లోయలో ఆటో బోల్తా

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:19 PM

బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లి నుంచి మంగళవారం సాయంత్రం కూలీలను కొయ్యూరు తీసుకు వస్తున్న ఆటో దొడ్డవరం సమీప సుద్దలమెట్ట ఘాట్‌లో అదుపు తప్పి లోయలో బోల్తా పడింది.

అదుపు తప్పి లోయలో ఆటో బోల్తా
అదుపు తప్పి లోయలో బోల్తా పడిన ఆటో

తొమ్మిది మంది కూలీలకు గాయాలు

కొయ్యూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లి నుంచి మంగళవారం సాయంత్రం కూలీలను కొయ్యూరు తీసుకు వస్తున్న ఆటో దొడ్డవరం సమీప సుద్దలమెట్ట ఘాట్‌లో అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ముకుడుపల్లిలో వాటర్‌షెడ్‌ పథకం రాతికట్టు పనులను కడప నుంచి వచ్చిన వలస కూలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి ఆటోలో కొయ్యూరు వస్తున్నారు. ఆటో బలభద్రం గ్రామ సమీప సుద్దలమెట్ట ఘాట్‌లో అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పి.వెంకటేశ్వర్లు(65), వెంకటరమణ(61), ఆర్‌.రమణయ్య(52), శంకరావు(63), డి.రమణ(60), విజయ్‌(18), ఆర్‌.ఆంజనేయులు(30), జయరామ్‌(56), ఎ.శ్రీను(35) గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి అంబులెన్స్‌లో రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొయ్యూరు, మంప ఎస్‌ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో సహకరించారు.

Updated Date - Feb 10 , 2026 | 11:19 PM