అదుపుతప్పి ఆటో బోల్తా
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:05 PM
మత్స్యగుండం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటో ఆదివారం పన్నేడా గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
ఆరుగురికి గాయాలు
పెదబయలు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మత్స్యగుండం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఆటో ఆదివారం పన్నేడా గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కిముడుపల్లి పంచాయతీ గాదెపల్లి గ్రామానికి చెందిన ఆటో గ్రామస్థులతో మత్స్యగుండం వెళ్లింది. మత్స్యలింగేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా పన్నేడా గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఆటోలో 15 మంది ఉండగా, వీరిలో వి.విజయశాంతి(35), ఎల్.సూరిబాబు(40), వి.గోవింద్(45), బి.ముకుంద్(55), ఎస్. రత్నకుమారి(35), ఎల్.రంజిత్(10) గాయ పడ్డారు. వీరిని స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిట్రాయిపుట్టు నుంచి బంగారుమెట్ట వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా రోడ్డు అంచుల్లో మట్టి వేసి సక్రమంగా రోలింగ్ చేయకపోవడం వల్లే ఆటో ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.