బే సిటీకి అథారిటీ
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:00 AM
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా కైలాసగిరి నుంచి భీమిలి వరకూ అభివృద్ధి చేయనున్న ‘బే సిటీ’ కోసం ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటుచేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు.
విశాఖ నుంచి భీమిలి సమీప గ్రామం వరకూ అభివృద్ధి
డిసెంబరుకల్లా కోస్టల్ కారిడార్‌కు డీపీఆర్ సిద్ధం
డిసెంబరులో విశాఖ ఉత్సవ్
పర్యాటకుల కోసం ‘విజిట్ వైజాగ్’ కాన్సెప్ట్‌నకు రూపకల్పన
కేజీహెచ్‌ను పరిశోధన సంస్థగా అభివృద్ధి చేసేందుకు ‘గూగుల్’ నిధులు
విమ్స్‌లో ‘హృదయాలయ’ యూనిట్
వచ్చే ఏడాదికి పూర్తిస్థాయిలో గోదావరి జలాలు రాక
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా కైలాసగిరి నుంచి భీమిలి వరకూ అభివృద్ధి చేయనున్న ‘బే సిటీ’ కోసం ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటుచేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు. ఆయన మంగళవారం తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ బే సిటీకి సంబంధించి పలు ప్రాజెక్టులు ప్రతిపాదించామని తెలిపారు. ప్రధానంగా పర్యాటకులకు ఆకట్టుకునేలా ప్రాజెక్టుల రూపకల్పనను వేగవంతం చేసేందుకు బే సిటీ అథారిటీ పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి రానున్న రెండు నెలల్లో విధాన రూపకల్పన చేస్తామన్నారు. బే సిటీలో భాగంగా విశాఖ నుంచి భీమిలి మండలంలోని శివారు గ్రామం వరకు సుమారు 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోస్టల్ కారిడార్ ఏర్పాటుచేస్తున్నామని, దీనికి అవసరమైన డీపీఆర్ ఈ ఏడాది డిసెంబరు నాటికి సిద్ధమవుతుందన్నారు. కోస్టల్ కారిడార్‌కు అవసరమైన భూమి సేకరిస్తామని, భూసేకరణ అధికారిగా జాయింట్ కలెక్టర్‌ను నియమించామన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నామన్నారు.
ఈ ఏడాది డిసెంబరులో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని, పర్యాటక శాఖ కార్యదర్శి ఇప్పటికే రెండు పర్యాయాలు సమీక్షించారని కలెక్టర్ తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ‘విజిట్ వైజాగ్’ కాన్సెప్ట్‌నకు రూపకల్పన చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో పేరొందిన నీలోఫర్ కాఫీ హౌస్‌ను నగరంలో, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఏర్పాటుచేయాలని నిర్వాహకులను కోరామన్నారు. ఇంకా ఆల్మండ్ హౌస్ గ్రూపు తయారుచేసే మనం చాక్లెట్ అవుట్‌లెట్‌ను విశాఖలో పెట్టేందుకు సంబంధిత నిర్వాహకులు ఆసక్తి చూపారని కలెక్టర్ తెలిపారు.
పెట్టుబడుల్లో భాగంగా విశాఖకు సంబంధించి 58 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకూ 26 గ్రౌండింగ్ చేశామన్నారు. మిగిలిన ప్రాజెక్టులు వచ్చే రెండు నెలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆయా పరిశ్రమలకు అవసరమైన అన్నిరకాల అనుమతులు వేగంగానే మంజూరుచేస్తున్నామన్నారు. ఈ ఏడాది అక్టోబరులో పెట్టుబడులకు సంబంధించి ప్రాంతీయ సదస్సు, నవంబరులో భాగస్వామ్య సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ప్రజా సానుకూలతలో నెల్లూరు తరువాత విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా 100 శాతం అక్షరాస్యత సాధించేలా ప్రణాళికలు అమలుచేస్తున్నామన్నారు. పాఠశాల స్థాయిలో కొరియా, జపాన్, జర్మనీ, ఫ్రెంచి భాషలు బోధించేలా బోధకులను నియమిస్తామన్నారు. సీఎస్సార్ నుంచి రూ.ఐదు కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేజీహెచ్‌ను పరిశోధన సంస్థగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను సామాజిక బాధ్యత కింద గూగుల్ సమకూర్చనున్నదని కలెక్టర్ వెల్లడించారు. క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించి ఆధునిక చికిత్సలు అందించేలా ఈ సంస్థ ముందుకువచ్చిందన్నారు. హృదలయా అనే గ్రూపు విమ్స్‌లో చిన్న పిల్లలకు సంబంధించి భారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేసిందన్నారు. నగరంలో నీటి కొరతపై జీవీఎంసీ అధికారులతో సమీక్షించామన్నారు. వచ్చే ఏడాదికి నగరానికి పూర్తిస్థాయిలో పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీరు వస్తుందని కలెక్టర్ తెలిపారు.
గూగుల్ డేటా సెంటర్‌లో ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ
తర్లువాడలో గూగుల్ సంస్థ నెలకొల్పుతున్న డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ (గాలిని ఉపయోగించి యంత్రాల ఉష్ణోగ్రతను తగ్గించే శీతలీకరణ విధానం)ని అమలు చేస్తామని సంబంధిత యాజమాన్యం తెలిపినట్టు కలెక్టర్ చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇంటెల్ డేటా సెంటర్ ఎయిర్‌కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుందన్నారు. ఇంటెల్ డేటా సెంటర్‌ను రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ బృందం సందర్శించిందని, అందులో తాను కూడా ఉన్నానన్నారు. డేటా సెంటర్ కూలింగ్‌కు నీరు అవసరం లేదని, అందులో పనిచేసే సిబ్బందికి మాత్రమే నీటి అవసరం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.