ఏయూ కొరడా
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:01 AM
నిబంధనలు పాటించని కళాశాలలపై ఆంధ్ర విశ్వవిశ్వవిద్యాలయం అధికారులు కొరడా ఝులిపించారు.
నిబంధనలు పాటించని అనుబంధ కళాశాలలకు షోకాజ్ నోటీసులు
జాబితాలో 28 డిగ్రీ, మూడు బీఈడీ కళాశాలలు, ఒక లా కాలేజీ కూడా...
సరిగా స్పందించని ఐదు కళాశాలల్లో ప్రవేశాలు నిలిపివేత
మిగిలిన వాటికి మూడు నెలల గడువు
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
నిబంధనలు పాటించని కళాశాలలపై ఆంధ్ర విశ్వవిశ్వవిద్యాలయం అధికారులు కొరడా ఝులిపించారు. వర్సిటీకి అనుబంధ కళాశాలలుగా కొనసాగాలంటే మౌలిక సదుపాయాలు కలిగి ఉండాలి. అయితే, అటువంటివేమీ లేకుండానే కొన్ని నడుస్తున్నట్టు అనుబంధ కాలేజీల గుర్తింపు (ఎఫిలియేషన్)నకు సంబంధించి నియమించిన కమిటీల పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో చర్యలకు సిఫారసు చేశాయి. ఆ మేరకు ఏయూ అధికారులు పలు డిగ్రీ, బీఈడీ, లా కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ జాబితాలో 28 డిగ్రీ, మూడు బీఈడీ, ఒక లా కళాశాల ఉన్నాయి. ఆయా లోపాలను మూడు నెలల్లోగా సరిచేసుకోవాలని సూచించారు. అయితే, వీటిలో నాలుగు డిగ్రీ కాలేజీలు, ఒక బీఈడీ కాలేజీ షోకాజ్ నోటీసులకు సరిగా స్పందించకపోవడంతో విత్ హోల్డ్‌లో పెట్టారు. అంటే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సదరు కాలేజీలకు ఏయూ అనుబంధ కాలేజీగా కొనసాగే గుర్తింపును ఇవ్వడం లేదని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయా కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు అవకాశం ఉండదు. ఇక, మిగిలిన కాలేజీలు వర్సిటీ అధికారులు ఇచ్చిన గడువులోగా లోపాలను సరిదిద్దుకోవాలి. లేదంటే ఆయా కాలేజీలపైనా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అత్యంత పకడ్బందీగా తనిఖీలు
ఏయూ అధికారులు అనుబంధ కాలేజీలు గుర్తింపు కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేసి తనిఖీలను పకడ్బందీగా నిర్వహించారు. వర్సిటీ పరిధిలోని 160 ప్రైవేటు డిగ్రీ కాలేజీల తనిఖీ కోసం 32 బృందాలను (ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులు), బీఈడీ కాలేజీలకు 12 కమిటీలు, లా కాలేజీల్లో తనిఖీలకు రెండు కమిటీలు, ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలకు ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఆయా కమిటీలు సుమారు నెలరోజులపాటు తనిఖీలు చేసి పలు లోపాలను గుర్తించాయి.
ఇవీ లోపాలు
మౌలిక వసతులైన సొంత భవనం, తరగతి గదుల, విస్తీర్ణం, అర్హత కలిగిన ఫ్యాకల్టీ, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, భద్రత, బెంచీలు, లైబ్రరీ వంటి సదుపాయాలు ఉన్నాయా?, లేదా?...అనే విషయాలను పరిశీలించి అనుబంధ కాలేజీలుగా యూనివర్సిటీ గుర్తింపు ఇస్తుంది. అయితే కొన్ని కళాశాలల్లో లోపాలు ఉండడంతో చర్యలకు కమిటీలు సిఫారసు చేశాయి. డిగ్రీ కాలేజీలకు అనుమతులు తీసుకుని నర్సింగ్, ఇతర కోర్సులు నిర్వహించడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ లేకపోవడం, ఫ్యాకల్టీలో కొందరికి తగిన అర్హత లేకపోవడం, భవనాలు అధ్వానంగా ఉండడం వంటి అంశాలను గుర్తించారు.
చవితి పందిళ్ల వద్ద శబ్ద కాలుష్యం
పీసీబీ తనిఖీల్లో వెల్లడి
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వినాయక చవితి పందిళ్ల వద్ద శబ్ద కాలుష్యం తీవ్రతను అంచనా వేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సోమ, మంగళవారాలు తనిఖీలు నిర్వహించారు. ఇరవై నాలుగు పందిళ్లు, పరిసరాల్లో శబ్ద కాలుష్యాన్ని యంత్రాల ద్వారా నమోదుచేశారు. పీసీబీ నిబంధనల మేరకు నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రి సమయంలో 45, వాణిజ్య ప్రాంతంలో 65, 55, పారిశ్రామిక ప్రాంతాల్లో 75, 70 డెసిబుల్స్ ఉండాలి. అంతకు మించి శబ్దం (ధ్వని) ఉంటే కర్ణభేరికి ఇబ్బంది. సోమ, మంగళవారాల్లో పందిళ్లు, పరిసర ప్రాంతాల్లో పరిమితికి మించి ఉన్నాయి. గోపాలపట్నంలో 105.7, ఎన్‌ఎడీ ఫ్లైఓవర్ వద్ద 105.1, గాజువాకలో 104.3 డెసిబుల్స్ నమోదయ్యాయి. మరికొన్నిచోట్ల 80 నుంచి 90 డెసిబెల్స్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. శబ్ద కాలుష్యం లేకుండా చూడాలని పందిళ్ల నిర్వాహకులకు సూచించినట్టు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ ముకుందరావు తెలిపారు. అదేవిధంగా వినాయక నిమజ్జనం సమయంలో డీజేలు వినియోగించరాదని సూచించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు 2,342 పోలింగ్ కేంద్రాలు
ముసాయిదా జాబితా విడుదల
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదలచేశారు. ఈ జాబితాలను ఆయా మండలాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 39 జడ్పీటీసీ స్థానాలు, 652 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,342 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. విశాఖ జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 200 పోలింగ్ కేంద్రాలు, అనకాపల్లి జిల్లాలో 24 జడ్పీటీసీ, 427 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 1,526, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ముసాయిదా జాబితాపై బుధవారం సాయంత్రం వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై సూచనలు, సలహాల కోసం బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. ఈనెల 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
29న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు
జిల్లాలో 593 ప్రభుత్వ పాఠశాలలు
విశాఖపట్నం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 29వ తేదీన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి పాఠశాల పరిధిలో ఒక కమిటీని తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. జిల్లాలో 593 ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్, ఎయిడెడ్, వివిధ రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లి/తండ్రి/సంరక్షకుడు ఓటరుగా ఉంటారు. ఓటర్ల జాబితాలను 18న పాఠశాలలో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం 25న తుది జాబితా విడుదల చేస్తారు. 29వ తేదీ ఉదయం నామినేషన్లు స్వీకరించి మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లుచేశామని డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు.