Share News

ఏపీఐసెట్‌ కన్వీనర్‌గా ఏయూ ప్రొఫెసర్‌ ఎం.శశి

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:59 AM

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీఐసెట్‌ కన్వీనర్‌గా ఏయూ ప్రొఫెసర్‌ ఎం.శశి

పీజీఈసెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ మల్లికార్జున నియామకం

విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఏయూ ప్రొఫెసర్లు రెండు సెట్లకు కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఐసెట్‌ కన్వీనర్‌గా కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ ఎం.శశి, ఎంటెక్‌, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్‌ కన్వీనర్‌గా ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ పి.మల్లికార్జునరావు నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల వర్సిటీ అధికారులు హర్షం వ్యక్తంచేశారు.


వారసత్వ రిజిస్ట్రేషన్లకు నామమాత్రపు ఫీజు

ఫిక్స్‌డ్‌ స్టాంపు డ్యూటీ

ఎకరా రిజిస్ర్టేషన్‌ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100, దాటితే రూ.1,000

కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):

పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం ఫిక్స్‌డ్‌ స్టాంపు డ్యూటీని విధించిందని, తక్కువ మొత్తంతో వాటిని రిజిస్టర్‌ చేసుకోవచ్చునని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ మంగళవారం ప్రకటించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు. వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములపై స్టాంపు డ్యూటీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించిందన్నారు. దీని ప్రకారం వ్యవసాయ భూములను ఎకరా రిజిస్ర్టేషన్‌ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100 ఫిక్స్‌డ్‌ స్టాంపు డ్యూటీ, మార్కెట్‌ విలువ రూ.10 లక్షలు దాటి ఉంటే వేయి రూపాయల స్టాంపు డ్యూటీతో వారసులు రిజిస్టర్‌ చేసుకోవచ్చునన్నారు. దీనివల్ల జీపీఏ హోల్డర్లకు వెసులుబాటు కలుగుతుందన్నారు.


‘ఉక్కు’లో వీఆర్‌ఎస్‌కు 350 మంది దరఖాస్తు?

20వ తేదీ వరకూ గడువు

600 దరఖాస్తులు అందుతాయని అంచనా

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):

విశాఖ స్టీల్‌ప్లాంటులో మూడో విడత వీఆర్‌ఎస్‌ కోసం ఇప్పటివరకూ సుమారు 350 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. తొలి విడత 1,500 మంది, రెండో విడత 550 మంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. మూడో విడత వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ వరకు సమయం ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 600 దరఖాస్తులు అందుతాయని అంచనా వేస్తున్నారు. కాగా ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తులను విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని యాజమాన్యం కల్పించింది. ప్రస్తుతం ప్లాంటులో 2,792 మంది అధికారులు, 6,514 మంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు మొత్తం 9,311 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఈ నెల 56 మంది, వచ్చే నెలలో 42 మంది ఉద్యోగ విరమణ చేయనున్నారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న వారితో కలిపి భారీసంఖ్యలో ఉద్యోగులు ప్లాంటును వీడనున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:59 AM