Share News

దేశ నిర్మాణంలో ఏయూ కీలక భూమిక

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:32 AM

విలువలతో కూడిన విద్యార్థులను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక భూమిక పోషించిందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మెగా కల్చరల్‌ ఫెస్ట్‌ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దేశ నిర్మాణంలో  ఏయూ కీలక భూమిక

శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా

విద్యార్థుల దగ్గర నటిస్తే కుదరదు, మనసు పెట్టాలి

కల్చరల్‌ ఫెస్ట్‌ ముగింపు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌

విద్యార్థులు బాధ్యత కలిగిన పౌరులుగా, నాయకులుగా ఎదగాలని పిలుపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి):

విలువలతో కూడిన విద్యార్థులను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక భూమిక పోషించిందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మెగా కల్చరల్‌ ఫెస్ట్‌ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఆర్‌ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, సీవీ రామన్‌ వంటివారు తమ మేధస్సుతో ఈ విశ్వవిద్యాలయాన్ని నడిపించారన్నారు. విద్యార్థులు ఇక్కడ గడిపే సమయం జీవితంలో ఎంతో విలువైనదిగా నిలుస్తుందన్నారు. ఏయూ జ్ఞాన దీపంగా ప్రకాశిస్తూ ప్రతి రంగంలో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. శతాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్న ఏయూ భారతీయ వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులతో మాట్లాడాలంటే ఆలోచించాలన్నారు. విద్యార్థుల దగ్గర నటిస్తే కుదరదని, మనసు పెట్టాలన్నారు. భగవంతుడు వర్సిటీలో చదువుకునే అవకాశం తనకు ఇవ్వకపోయినా, ఇక్కడకు వచ్చే అవకాశం కల్పించాడన్నారు. ఏయూ గొప్పదనాన్ని, ఇక్కడ విభాగాల ఏర్పాటు గురించి స్నేహితుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ద్వారా తెలుసుకున్నానన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ అనేక తరాలను తీర్చిదిద్దుతున్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఏయూ నిలవడం గొప్ప విషమన్నారు.

ఓటమికి సిద్ధపడే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఒక భావాన్ని బలంగా నమ్మితే దాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా ఫలితాన్ని పొందవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన పౌరులుగా, నాయకులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వేల మంది విద్యార్థుల మధ్యకు వచ్చి మాట్లాడాలంటే సాహసం చేయాలని, అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే సాహసం చేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడేటప్పుడు తాను తెలివితేటలు వాడనని, మనసు వాడతానన్నారు. విద్యార్థులు విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఏయూ వారసత్వ సంపదకు నిలయమని, మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణమనే మూడు లక్ష్యాలతో ఏర్పాటుకావడం గొప్ప విషయమన్నారు. ఉద్యోగాలు కోసమే కాకుండా వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకునడిపే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థల్లో బలమైన మార్పులను తెచ్చే శక్తులుగా వర్సిటీ పూర్వ విద్యార్థులు నిలిచారని, అదే బాటలో నడవాలని సూచించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ శతాబ్ది వేడుకల్లో భాగంగా గడిచిన ఏడాది నుంచి అనేక సదస్సులు, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు నిర్వహించినట్టు వెల్లడించారు. మరెక్కడా లేనివిధంగా ఏయూలో 1,100 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని, వారిని వేడుకల్లో భాగస్వాములను చేశామన్నారు. కల్చరల్‌ ఫెస్టివల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.విజయమోహన్‌ మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌దన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌ కుమార్‌, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి కింగ్‌, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు, ఫెస్ట్‌ కో చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎ.పల్లవి, కన్వీనర్లు ప్రొఫెసర్‌ ఎన్‌ఎం యుగంధర్‌, సీహెచ్‌ ఆశా ఇమ్మానియల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కార్యక్రమంలో భాగంగా ముందుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఏయూ అధికారులతో కలిసి సుమారు గంటసేపు డిప్యూటీ సీఎం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు, పవన్‌ కల్యాణ్‌ వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంత వరకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణం ఈలలు, కేరింతలతో హోరెత్తింది. మీ ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉందంటూ పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఫెస్టివల్‌ నిర్వహించిన ప్రాంగణంలో పవన్‌ కల్యాణ్‌ ఫొటోతో కూడిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ప్రదర్శించగా, ఎంతగానో ఆకట్టుకుంది.

Updated Date - Apr 09 , 2026 | 01:32 AM