క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో ఏయూ
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:06 AM
అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థానం దక్కించుకుంది.
దక్షిణాసియా విభాగంలో 270వ ర్యాంకు
ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో 851-900 బ్యాండ్‌లో చోటు
పరిశోధన, ఆవిష్కరణలు, బోధన నాణ్యత, అంతర్జాతీయ భాగస్వామ్యాలు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వంటి అంశాల ఆధారంగా ప్రకటన
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థానం దక్కించుకుంది. క్యూఎస్ (క్వాక్వారెల్లి సైమండ్స్) ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో దక్షిణాసియా విభాగంలో ఏయూ 270వ ర్యాంకును సాధించింది. ఓవరాల్ ర్యాంకింగ్‌లో 851-900 బ్యాండ్‌లో చోటు సంపాదించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధన, ఆవిష్కరణలు, బోధనా నాణ్యత, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తదితర అంశాల్లో పురోగతిని పరిశీలించి ఈ ర్యాంకులను సంస్థ ప్రకటిస్తుంది. ఈ పోటీల్లో నాలుగు వేలకుపైగా విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు పాల్గొనగా, ఏయూ మెరుగైన ర్యాంకును సాధించి సత్తా చాటింది. అన్ని విభాగాల్లో పనితీరు, సమన్వయంతో సాగుతున్న పరిశోధనల ఆధారంగా ర్యాంకు ప్రకటిస్తారని ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, రెక్టార్ ప్రొఫెసర్ పి.కింగ్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు పేర్కొన్నారు. ర్యాంకు సాధనలో కృషిచేసిన ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (ఐక్యూఏసీ) బృందాన్ని ఈ సందర్భంగా వారంతా అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయ ప్రతిష్టను మరింత పెంచేందుకు పరిశోధనల నాణ్యతను మెరుగుపరచడం, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాలు పెంపొందించడం, పరిశ్రమల అనుసంధానాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని వీసీ డాక్టర్ జీపీ రాజశేఖర్ పేర్కొన్నారు.
వర్సిటీల పనితీరు విశ్లేషించి ర్యాంకులు
బ్రిటన్‌కు చెందిన క్యూఎస్ సంస్థ అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థలను పనితీరును విశ్లేషించి ఏటా ర్యాంకులు కేటాయిస్తుంది. 2009 నుంచి ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తోంది. విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు, పరిశోధన సామర్థ్యం, అంతర్జాతీయ గుర్తింపు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయో అంచనా వేసి ర్యాంకులను కేటాయిస్తుంది.