Share News

25న ఏయూ స్నాతకోత్సవం

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:57 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92 స్నాతకోత్సవాలను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ పేర్కొన్నారు.

25న ఏయూ స్నాతకోత్సవం

గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హాజరు

ముఖ్య అతిథిగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌ పూర్ణచంద్రరావు సగ్గుర్తి

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92 స్నాతకోత్సవాలను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ పేర్కొన్నారు. ఏయూ అకడమిక్‌ సెనేట్‌ హాల్‌లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. స్నాతకోత్సవానికి ఏయూ చాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తోపాటు విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌ హాజరవుతున్నారన్నారు. ముఖ్య అతిథిగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌, ఏయూ పూర్వ విద్యార్థి పూర్ణచంద్రరావు సగ్గుర్తి రానున్నారని, వర్సిటీ తరపున ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత తల్లావజ్ఝల పతంజలి శాస్ర్తికి గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేస్తామన్నారు. స్నాతకోత్సవం ఉదయం 9 గంటలకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభమవుతుందన్నారు. ఈ స్నాతకోత్సవంలో ఇద్దరు ప్రొఫెసర్లకు బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డులు, పీహెచ్‌డీలో 17 మందికి రీసెర్చ్‌ మెడల్స్‌, 134 మందికి రీసెర్చ్‌ బహుమతులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఏడుగురికి ఎంఫిల్‌, 441 మందికి పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వివరించారు. సమావేశంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.కింగ్‌, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు, అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:57 AM