Share News

ఘనంగా ఏయూ స్నాతకోత్సవం

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:43 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఉదయం ఘనంగా జరిగింది.

ఘనంగా ఏయూ స్నాతకోత్సవం

చాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

ముఖ్య అతిథిగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పూర్ణచంద్రరావు సగ్గుర్తి హాజరు

ఆయనతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్ఝల పతంజలిశాస్ర్తికి గౌరవ డాక్టరేట్లు

పలువురికి పీహెచ్‌డీ, ఎంఫిల్‌ పట్టాలు, గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. చాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ చైర్మన్‌, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్‌ పూర్ణచంద్రరావు హాజరయ్యారు. ఆయనతో పాటు సాహిత్య విభాగంలో విశేష సేవలు అందించిన తల్లావజ్ఝల పతంజలిశాస్ర్తికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ ఏయూ నాక్‌ ‘ఏ’++, ఐఎస్‌వో గుర్తింపుతో ముందుకు సాగుతోందన్నారు. పరిశోధన, స్టార్టప్‌లు, పేటెంట్‌ నమోదులో ముందంజలో ఉందని ప్రశంసించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో రాజకీయాలకు దూరంగా ఉండి, విద్య, వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులు దృష్టిసారించాలని హితవు పలికారు. నాన్‌ బోర్డర్స్‌ హాస్టల్స్‌లో ఉండకుండా చూడాలని వీసీకి సూచించారు. ఏయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ వర్సిటీ పురోగతికి చాన్సలర్‌ అందిస్తున్న ప్రోత్సాహం, మార్గదర్శకత్వం కీలకంగా ఉందన్నారు. స్నాతకోత్సవంలో జియో, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు, ప్రొఫెసర్‌ సీఎన్‌వీ సత్యనారాయణరెడ్డికి బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డులను అందించారు. ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగం నుంచి ఎనిమిది మంది, ఫ్యాకల్టీ ఆఫ్‌ లా నుంచి ఇద్దరు, ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ నుంచి ఏడుగురు ..మొత్తం 17 మంది రీసెర్చ్‌ అవార్డులు, అలాగే 13 మంది రీసెర్చ్‌ బహుమతులు, ఏడుగురు ఎంఫిల్‌ డిగ్రీలు, 441 మంది పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. 174 యూజీ, పీజీ మెడల్స్‌, 437 యూజీ, పీజీ బహుమతులను 148 మందికి అతిథులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ మధుమూర్తి, రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.కింగ్‌, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు, మాజీ వీసీలు, అకడమిక్‌ సెనేట్‌ సభ్యులు, పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 12:43 AM