అమెరికాలో ఏయూ శతాబ్ది వేడుకలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:56 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా (ఏయూఏఏ-ఎన్‌ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్‌ల్యాండ్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించారు.
హ్యూస్టన్‌లో కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన పూర్వ విద్యార్థులు
విశాఖపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా (ఏయూఏఏ-ఎన్‌ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్‌ల్యాండ్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. వేడుకలకు అమెరికాలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 12 గంటలకుపైగా సాగిన వేడుకలో విద్యాచర్చలు, పూర్వ విద్యార్థుల పరస్పర సమావేశాలు, ప్యానెల్ చర్చలు, విజయగాథలు, ప్రతిభావంతులకు సత్కారాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ శతాబ్ది వేడుకల అనంతరం ఏయూ చేపట్టిన కార్యక్రమాలు, ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధన, నూతన ఆవిష్కరణ లు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా వర్సిటీ ముందుకు సాగుతోందన్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రతిభావంతులైన పూర్వ విద్యార్థులు వర్సిటీ అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు. బోధన, పరిశోధన రంగాల్లో సహకారం అందించాలని, అమెరికా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పరచాలని కోరారు. విద్యార్థులు, యువ అధ్యాపకులకు మార్గదర్శకత్వం అందించడంతోపాటు వర్సిటీ విద్యాభివృద్ధి ప్రాధాన్యాలకు మద్దతుగా ఎండోమెంట్ నిధులను ఏర్పాటుచేయాలని సూచించారు. డాక్టర్ సాయి రాచకొండ శతాబ్ది వేడుకల ప్రాధాన్యం, వర్సిటీ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరాన్ని వివరించారు. డాక్టర్ ఫణీంద్ర కొండాపి మాట్లాడుతూ హ్యూస్టన్‌లో 2005లో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటైందని, అప్పటి నుంచి సంఘం అభివృద్ధి తీరును వివరించారు. ఆరియా యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కూచిబొట్ల, యూఎన్‌సీడబ్ల్యూ అధ్యక్షుడు డాక్టర్ అశ్వని ఓలేటి, డాక్టర్ చిట్టెన్‌రాజు వంగూరి, టెక్సాస్ ఏఅండ్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మన్సూర్ ఖాన్, డాక్టర్ లక్ష్మి కె గౌర్, డాక్టర్ రజనీ, డాక్టర్ రత్నం చిత్తూరి, డాక్టర్ సురేష్ కె,అలహరి తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో వర్సిటీ అంతర్జాతీయ వ్యవహారాల విభాగం డీన్ ప్రొఫెసర్ పాల్‌డగ్లస్, హ్యూస్టన్‌లోని భారత హై కమిషన్ తరఫున ప్రశాంత్ కుమార్ సోనా గౌరవ అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విజయాలు సాధించిన 50 మంది పూర్వ విద్యార్థులను సత్కరించారు. సమావేశంలో 90 ఏళ్ల వయసున్న సీనియర్ పూర్వ విద్యార్థుల నుంచి 27 ఏళ్ల వయసున్న వారు పాల్గొన్నారు.
విరాళాల సేకరణపై చర్చ..
అమెరికాలోని పూర్వ విద్యార్థుల నుంచి ఏయూకు విరాళాలు అందించేందుకు అవసరమైన చట్టపరమైన, సంస్థాగత విధానాలపై సమావేశంలో చర్చించారు. దేశంలో అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా విదేశీ విరాళాలను స్వీకరించేందుకు అనువైన మార్గాలను పరిశీలించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విందుతో వేడుకలు ముగిశాయి.