వివాహితపై హత్యాయత్నం
ABN , Publish Date - May 21 , 2026 | 12:56 AM
వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆమెను ఏకంగా అంతమొందించేందుకు ఒడిగట్టాడు. ఈ సంఘటనకు సంబంధించి భీమిలి సీఐ తిరుమలరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మనస్పర్థలు రావడంతో ప్రియుడి అఘాయిత్యం
భీమునిపట్నం/కొమ్మాది, మే 20 (ఆంధ్రజ్యోతి):
వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఆమెను ఏకంగా అంతమొందించేందుకు ఒడిగట్టాడు. ఈ సంఘటనకు సంబంధించి భీమిలి సీఐ తిరుమలరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధురవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన మహిళ (27)కు తన మేనమామతో వివాహమైంది. ఒక పాప, బాబు ఉన్నారు. స్వతంత్రనగర్‌కు చెందిన కొయ్య కార్తీక్ (29)కు వివాహమైంది. భార్యతో బాటు ఇరువురు పిల్లలు ఉన్నారు. ఆ మహిళ కుటుంబం తొలుత స్వతంత్రనగర్‌లో ఉండేది. అప్పుడే ఆమె, కార్తీక్ ప్రేమించుకున్నారు. ఇరువురికీ వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిగినా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. ఇదిలావుండగా భర్తతో విభేదాలు రావడంతో కొంతకాలంగా ఆమె విడిగా ఉంటుంది. నగరంలోని బంగారం దుకాణంలో పనిచేసే ఆ మహిళ, భవన నిర్మాణంలో సీలింగ్ పనులు చేసే కార్తీక్ మధ్య సంబంధం కొనసాగుతుంది. ఈ విషయం తెలిసి కార్తీక్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కార్తీక్, ఆమె బైక్‌పై నిర్మానుష్యంగా ఉండే కాపులుప్పాడ వుడా లేఅవుట్ ప్రాంతానికి వచ్చారు. అక్కడ రాత్రి ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైరుతో ఆమె మెడకు గట్టిగా బిగించాడు. ఆమె చనిపోయిందని భావించి అక్కడున్న పొదల్లోకి తోసేసి బైక్‌పై పరారయ్యాడు. బుధవారం ఉదయం లేఅవుట్ సమీపంలోని పొదల్లో కొనఊపిరితో మూలుగుతున్న వివాహితను అటుగా వాకింగ్‌కు వెళ్లిన పలువురు గుర్తించి 108కు ఫోన్ చేశారు. ప్రస్తుతం ఆమె రుషికొండ గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భీమిలి సీఐ తిరుమలరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ లలిత్ ఆదిత్య కేసు నమోదుచేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇరువురి మధ్య గొడవకు మనస్పర్థలే కారణమా లేక ఆర్థిక పరమైన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.