Share News

ఐటీడీఏ ముట్టడికి యత్నం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:03 AM

పాడేరు ఐటీడీఏ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల (సీహెచ్‌డబ్ల్యూ) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

ఐటీడీఏ ముట్టడికి యత్నం
ఐటీడీఏ ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సీహెచ్‌డబ్ల్యూలు

సమస్యలు పరిష్కరించాలని సీహెచ్‌డబ్ల్యూల డిమాండ్‌

పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయింపు

రెండు గంటల సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం

ఐటీడీఏ పీవో హామీతో ఆందోళన విరమణ

పాడేరురూరల్‌, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పాడేరు ఐటీడీఏ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల (సీహెచ్‌డబ్ల్యూ) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఐటీడీఏ ముట్టడికి వచ్చిన సీహెచ్‌డబ్ల్యూలను ఐటీడీఏ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. దీని వల్ల పాడేరు-అరకు, పాడేరు-చింతపల్లి, పాడేరు-విశాఖపట్నం వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీహెచ్‌డబ్ల్యూల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. పరిస్థితిని గమనించిన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆందోళనకారులతో చర్చలు జరిపారు. రెండు నెలల్లో సీహెచ్‌డబ్ల్యూలను ఆశాలుగా మార్పు చేస్తామని, బకాయి ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేస్తామని ఆయన ప్రకటించడంతో యూనియన్‌ నాయకులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్‌.సుందరరావు, ఎల్‌.బి.పోతురాజు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్న పడాల్‌, సీహెచ్‌డబ్ల్యూ యూనియన్‌ నాయకులు పార్వతి, భవానీ, నాగమణి, కుమారి, లక్ష్మి, ఈశ్వరమ్మ, ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 12:03 AM