Share News

ఘోరం

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:45 AM

నగర పరిధిలోని వడ్లపూడి-శ్రీనగర్‌ బ్రిడ్జిపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఘోరం
పొట్నూరు సతీష్‌ (27), పొట్నూరు గిరీష్‌ (26) (ఫైల్‌ ఫొటో)

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మరణం

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కూర్మన్నపాలెం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని వడ్లపూడి-శ్రీనగర్‌ బ్రిడ్జిపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేటకు చెందిన పొట్నూరు వెంకటరమణ, తన భార్య కళావతి బతుకుతెరువు కోసం ఇరవై సంవత్సరాల క్రితం గాజువాక వలస వచ్చారు. అక్కిరెడ్డిపాలెం సమీపంలోని వివేకానంద కాలనీలో తమ కుమారులతో కలిసి నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు పొట్నూరు సతీష్‌ (27) అనకాపల్లిలో రిలయన్స్‌ ప్రమోటర్‌గా, చిన్న కుమారుడు పొట్నూరు గిరీష్‌ (26) అనకాపల్లి బజాజ్‌ షోరూమ్‌లో ప్రమోటర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం తమ రాయల్‌ ఎన్‌ఫీల్ట్‌ బైక్‌పై ఇద్దరూ డ్యూటీకి వెళ్లారు. రాత్రికి ఇద్దరూ ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు ఫోన్‌ చేసినా కలవలేదు. కాగా వీరిద్దరూ తెల్లవారుజామున అనకాపల్లి నుంచి తమ ద్విచక్ర వాహనంపై వస్తుండగా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో విజయవాడ నుంచి విజయనగరం వెళుతున్న ఆర్టీసీ బస్సు వడ్లపూడి-శ్రీనగర్‌ బ్రిడ్జిపై వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో వారు కుడి వైపునకు రోడ్డుపై పడిపోయారు. వారి మీదుగా బస్సు వెనుక చక్రాలు వెళ్లిపోయాయి. దీంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. వాహన చోదకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా రాత్రంతా కుమారులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో గడిపారు. ఫోన్‌ చేస్తూనే ఉన్నారు. ఇలా తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో గిరీష్‌కు రమణ ఫోన్‌ చేయగా...పోలీసులు లిఫ్ట్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి, అక్కడి నుంచి కేజీహెచ్‌కు వెళ్లారు. అంది వచ్చిన ఇద్దరు కుమారులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బస్సును అజాగ్రత్తగా, అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి కుమారుల మృతికి కారణమైన విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన బస్సు డ్రైవర్‌ ఎ.శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని తండ్రి రమణ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ విధులు ముగించుకొని రాత్రికే ఇంటికి వచ్చే సతీష్‌, గిరీష్‌లు మంగళవారం ఎందుకు రాలేదు. ఎక్కడికి వెళ్లారు. తెల్లవారుజామున ఎందుకు బయలుదేరారనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదుచేసి, దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనకాపల్లిలో ఇల్లు చూసుకున్నారు...ఈలోగానే

తమకు ప్రతిరోజూ అనకాపల్లి వెళ్లి రావడం కష్టంగా ఉందని, ఇక్కడి నుంచి కుటుంబమంతా అక్కడకు షిఫ్ట్‌ అయ్యేందుకు తల్లిదండ్రులను ఒప్పించారు. అనకాపల్లిలో ఓ ఇల్లు అద్దెకు చూశారు. గురువారం అనకాపల్లి మారేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా ఘోరం జరిగిపోయింది.

Updated Date - Jul 02 , 2026 | 01:45 AM