ఏటీఎం కార్డులు మార్చేసి నగదు చోరీ
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:54 AM
ఏటీఎం వద్ద కాపుగాసి వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు తారుమారు చేసి నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
నిరక్షరాస్యులు, వృద్ధులు లక్ష్యంగా దొంగతనాలు
అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన పట్టణ పోలీసులు
9 ఏటీఎం కార్డులు, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో నిందితుడిపై 20 కేసులు
నర్సీపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏటీఎం వద్ద కాపుగాసి వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు తారుమారు చేసి నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామానికి చెందిన సుకల నూకరాజు ఈ నెల 17వ తేదీన నగదు డ్రా చేయానికి డీబీఆర్ వస్త్రదుకాణం పక్కన ఉన్న ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతనికి ఏటీఎంతో డబ్బులు డ్రా చేయడం చేతకాక, అక్కడున్న గుర్తు తెలియని వ్యక్తిని సహాయం అడిగాడు. ఆ వ్యక్తి నూకరాజు నుంచి ఏటీఎం కార్డు తీసుకొని పిన్ నంబరు అడిగాడు. మూడుసార్లు ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టి డబ్బులు రావడం లేదని చెప్పి, ఏటీఎం కార్డు తిరిగి ఇచ్చే క్రమంలో తన దగ్గర ఉన్న పని చేయని ఏటీఎం కార్డును నూకరాజుకి ఇచ్చాడు. ఆ తర్వాత నూకరాజు ఏటీఎం కార్డుతో గుర్తు తెలియని వ్యక్తి రూ.15 వేలు విత్‌డ్రా చేశాడు. నగదు తీసినట్టు సెల్‌ఫోన్‌కి మెసేజ్ వచ్చినా మొదట్లో నూకరాజు చూసుకోలేదు. తర్వాత రోజు నగదు విత్ డ్రా చేసినట్టు గుర్తించి బ్యాంక్‌కి వెళ్లి అడిగాడు. అతని ఖాతా నుంచి రూ.15 వేలు విత్ డ్రా చేసినట్టు బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న నూకరాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ సీఐ గఫూర్ ప్రత్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా క్రైమ్ పోలీసుల బృందం విచారణ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహా కేసులు
పోలీసులు విచారణలో ఏటీఎం కార్డులు మార్చేసి నూకరాజు బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కాజేసిన వ్యక్తి ప్రకాశం జిల్లా వీరన్నపాలెం గ్రామానికి చెందిన మువ్వ వీరయ్య చౌదరి(43)గా గుర్తించారు. ప్రస్తుతం విశాఖపట్నం మర్రిపాలెంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో అతను నివాసం ఉంటున్నాడు. సోమవారం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి సమీపంలో అతను ఉన్నట్టు సమాచారం రావడంతో సీఐ గఫూర్ సిబ్బందితో వెళ్లి వీరయ్య చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై మిర్యాలగూడ టూ టౌన్‌లో రెండు, పాలకొండ, ఆముదాలవలస, లాలాపేట, జనగాం, కాజీపేటలో ఒక్కొక్కటి చొప్పున ఇటువంటి కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. 2017 నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో 20 కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. నిందితుడి నుంచి రూ.10 వేలు నగదు, 9 ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నంబర్లు చెప్పవద్దని ప్రజలకు డీఎస్పీ సూచించారు. దర్యాప్తులో పాల్గొన్న క్రైమ్ సిబ్బంది, ఎస్‌ఐ రమేశ్‌ని ఆయన అభినందించారు.