Share News

అథ్లెట్‌ జ్యోతికి గ్రూప్‌-1 ఉద్యోగం

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:27 AM

విశాఖపట్నానికి చెందిన అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతికి డిగ్రీ పూర్తికాగానే గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

అథ్లెట్‌ జ్యోతికి గ్రూప్‌-1 ఉద్యోగం

  • 500 గజాల ఇంటి స్థలం

  • శిల్పారామంలో కన్వెన్షన్‌ సెంటర్‌ ఒప్పందం రద్దు..కొత్తగా ఈఓఐ

  • ఎండాడలో గ్యాస్ర్టో ఎంటరాలజీ ఆస్పత్రికి 9.04 ఎకరాలు

  • రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం

విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నానికి చెందిన అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతికి డిగ్రీ పూర్తికాగానే గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అమరావతిలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అర్జున అవార్డు సాధించిన జ్యోతి 2023, 2025లలో ఆసియా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించడమే కాకుండా ఒలింపిక్స్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. పేదరికంలో ఉన్నా పట్టుదలతో ఉన్నత స్థాయికి వచ్చిన ఆమె క్రీడాస్ఫూర్తిని గుర్తించిన ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవడానికి 500 గజాల స్థలం కూడా ఇవ్వడానికి నిర్ణయించింది.

- మధురవాడ శిల్పారామంలో బొటిక్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న గార్డెన్‌సిటీ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం రద్దు చేసి బిడ్‌ సెక్యూరిటీ మొత్తం జప్తు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అంతేకాకుండా వాటిని నిర్వహించడానికి కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇవ్వాలని సూచించింది.

- ఎండాడలో ఆసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి, పరిశోధన సంస్థ ఏర్పాటుచేయడానికి 15 ఎకరాల స్థలం కోరగా మంత్రివర్గం సర్వే నంబరు 14/5లో 9.04 ఎకరాలు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. దీనికి గజానికి రూ.44 వేలు చొప్పున మార్కెట్‌ రేటు చెల్లించాలని స్పష్టంచేసింది. మొత్తం భూమి 43,733.6 గజాలు వస్తుందని పేర్కొంది. ఈ భూమికి సాధారణ నిబంధనలన్నీ వర్తిస్తాయని స్పష్టంచేసింది.


సికింద్రాబాద్‌ వందేభారత్‌కు కోచ్‌ల పెంపు

విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య భారీ డిమాండ్‌తో నడుస్తున్న వందే భారత్‌ రైళ్లకు వాల్తేరు డివిజన్‌ అధికారులు అదనంగా మరో నాలుగు కోచ్‌లు జత చేశారు. ఈ నెల పదో తేదీ వరకు 16 కోచ్‌లతోనే వందే భారత్‌ రైళ్లు నడిచాయి. ఇప్పుడు వాటిని 20కి పెంచారు. ఇందులో ఏసీ చైర్‌ కార్‌కోచ్‌లు 18 కాగా, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కోచ్‌లు రెండు. ఈ రైలులో మొన్నటి వరకు 1,128 సీట్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 1,440కు పెరిగింది. 20833 నంబర్‌ కలిగిన రైలు విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. అక్కడ నుంచి తిరిగి (నంబరు 20834) మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.35 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. వీటిని ప్రారంభించినప్పటి నుంచి ఆక్యుపెన్సీకి మించిన డిమాండ్‌తో నడుస్తున్నాయి. దాంతో కోచ్‌లు పెంచినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రెండు, విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు మూడోది, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు నాలుగోది నడుపుతున్నారు. భవిష్యత్తులో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తిరుపతికి స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ కోసం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో వందే భారత్‌ రైళ్ల కోసం రూ.300 కోట్లతో మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 01:49 AM