పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:26 AM
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వచ్చే నెల రెండో తేదీన జిల్లాలోని 79 పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆనందపురం మండలంలో 260, భీమిలి మండలంలో 166, పద్మనాభం మండలంలో 226, పెందుర్తి మండలంలో 150...మొత్తం 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం
కమిషనరేట్ నుంచి 166 కెమెరాలు సరఫరా
జిల్లాలో 297 సెన్సిటివ్ కేంద్రాలు
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘటనలూ చోటుచేసుకోకుండా అధికారుల ముందస్తు చర్యలు
విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వచ్చే నెల రెండో తేదీన జిల్లాలోని 79 పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆనందపురం మండలంలో 260, భీమిలి మండలంలో 166, పద్మనాభం మండలంలో 226, పెందుర్తి మండలంలో 150...మొత్తం 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే గత ఎన్నికల సమయంలో తలెత్తిన గొడవలను పరిగణనలోకి తీసుకుని 297 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. ఆనందపురం మండలంలో 70, భీమిలిలో 78, పద్మనాభంలో 80, పెందుర్తిలో 69 సెన్సిటివ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని జిల్లా కేంద్రంలో పనిచేసే కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. అదే సమయంలో మిగిలిన కేంద్రాల్లో కూడా కెమెరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ 166 సీసీ కెమెరాలను జిల్లాకు కేటాయించారు. ఒకటి అంతకంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నచోట కమిషనర్ కేటాయించిన కెమెరాలను ఏర్పాటుచేస్తారు. మిగిలినచోట్ల కెమెరాలతో పోలింగ్ సరళిని చిత్రీకరించడానికి 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకోనున్నారు. విద్యార్థులకు ఎన్నికల అధికారులకు మాదిరిగానే పారితోషికం ఇవ్వడంతో పాటు రవాణా, భోజన వసతి సదుపాయం అందిస్తారు. ఇంకా ఏమైనా కేంద్రాలు మిగిలి ఉంటే వీడియోగ్రాఫర్లను నియమించాలని ప్రతిపాదించారు. జిల్లాలో 42 భవనాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రం, 44 చోట్ల రెండు పోలింగ్ కేంద్రాలు, 17 చోట్ల మూడు, 28 చోట్ల నాలుగు కేంద్రాలు, 63 కేంద్రాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.
పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారి ఎంవీఎన్ శ్రీనివాసరావు మాట్లాడూత ఈ పర్యాయం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొన్నిచోట్ల ఒకే భవనంలో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నందున అక్కడ ఒక కెమెరా ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలు వినియోగించుకుంటామన్నారు.