శరవేగంగా...
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:22 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇంజనీరింగ్ విభాగం మొత్తం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణంపైనే పనిచేస్తోంది.
చురుగ్గా సాగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని లక్ష్యం
ఏప్రిల్ నెలాఖరుకు కొన్ని..మే చివరికి మరికొన్ని అందుబాటులోకి వస్తాయంటున్న అధికారులు
రూ.120.29 కోట్లతో టెండర్లు
23 శాతం తక్కువకే కాంట్రాక్టు ఖరారు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇంజనీరింగ్ విభాగం మొత్తం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణంపైనే పనిచేస్తోంది. భోగాపురం విమానాశ్రయం జూన్‌లో ప్రారంభించే అవకాశం ఉందని, మే నెలాఖరుకు దానిని అనుసంధానం చేస్తూ వీఎంఆర్‌డీఏ చేపట్టిన మాస్టర్‌ప్లాన్ రహదారుల విస్తరణ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
ఏడు మాస్టర్‌ప్లాన్ రహదారుల విస్తరణకు ముందు రూ.174.64 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ తరువాత అన్ని లెక్కలు వేసి రూ.120.29 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు 23 శాతం తక్కువకే (రూ.92.9 కోట్లు) చేస్తామని ముందుకువచ్చారు. నిర్మాణ పనులు డిసెంబరులో ప్రారంభించారు. ఇప్పటికి 70 శాతం పూర్తిచేశారు. కొన్ని మార్గాల్లో ప్రైవేటు భూములకు టీడీఆర్లు ఇవ్వాల్సి ఉండగా వాటినీ క్లియర్ చేస్తున్నారు. అడవివరం నుంచి శొంఠ్యాం వరకు విస్తరిస్తున్న మార్గంలో అటవీ శాఖ భూమి ఉండడంతో దాని కోసం ఢిల్లీ స్థాయిలో అనుమతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు.
- అడవివరం నుంచి శొంఠ్యాం వరకు 8.02 కి.మీ. రహదారిని 100 అడుగుల వెడల్పున విస్తరిస్తున్నారు. దీనిని ఆరు వరుసల రహదారిగా మారుస్తున్నారు. ఇందులో భైరవస్వామి ఆలయం సమీపాన రహదారికి అటు,ఇటు సుమారుగా 6.83 హెక్టార్ల అటవీ స్థలం ఉండడంతో అక్కడ మాత్రమే పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. మిగిలిన రహదారి పనులు 60 శాతం పూర్తయ్యాయి.
- తాళ్లవలస నుంచి నేరెళ్లవలస జంక్షన్‌ను కలుపుతూ 3.89 కి.మీ. రహదారిని 80 అడుగుల వెడల్పున విస్తరిస్తున్నారు. దీనిని నాలుగు వరుసల్లో వేస్తున్నారు. ఈ మార్గంలో ప్రభుత్వ పాఠశాల అడ్డంగా ఉండడంతో దానిని తొలగించి, వేరే దగ్గర వీఎంఆర్‌డీఏ నిధులతోనే కొత్త భవనం నిర్మించనున్నారు. 65 శాతం పనులు పూర్తయ్యాయి. ఇది మే చివరికి పూర్తవుతుంది.
- మారికవలస మార్గంలో శివశక్తినగర్ నుంచి వీఎంఆర్‌డీఏ హరిత ప్రాజెక్టు వరకు 1.67 కి.మీ. మేర రహదారిని 40/60/80 అడుగుల మేరకు విస్తరిస్తున్నారు. కొన్నిచోట్ల రెండు వరుసలు, మరికొన్నిచోట్ల నాలుగు వరుసలు వేస్తున్నారు. ఈ మార్గంలో ప్రైవేటు భూముల వివాదం కోర్టులో ఉంది. టీడీఆర్‌లు ఇవ్వాల్సి ఉంది. దీనిని కూడా మే నెలాఖరుకు పూర్తి చేస్తారు.
- పరదేశిపాలెం నుంచి గంభీరం రిజర్వాయర్ వరకు 1.46 కి.మీ. రహదారిని 60 అడుగుల వెడల్పున విస్తరిస్తున్నారు. 70 శాతం పనులు పూర్తయ్యాయి.
- అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిలో గల పాలవలస వద్ద నుంచి గంభీరం రిజర్వాయర్ మీదుగా బోయపాలెం జంక్షన్ వరకూ 2.18 కి.మీ. మేర రోడ్డును 60 అడుగుల మేర విస్తరిస్తున్నారు. ఈ మార్గంలో టీడీఆర్‌లు ఇంకా ఇవ్వాల్సి ఉన్నందున పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే అనకాపల్లి నుంచి వచ్చేవారు ఆనందపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా పాలవలస వద్ద మలుపు తీసుకొని బోయపాలెం వద్ద హైవే పైకి చేరుకోవచ్చు. ఆరు కి.మీ. ప్రయాణం కలిసి వస్తుంది.
- చిప్పాడలో 6.45 కి.మీ. దివీస్ రహదారిని 80 అడుగుల వెడల్పున విస్తరించనున్నారు. దీనికి రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంది. ఇది సెప్టెంబరుకు గానీ పూర్తయ్యే అవకాశం లేదు.
వీలైనంత వరకు పూర్తి చేస్తాం
ప్రణవ్ గోపాల్, చైర్మన్, వీఎంఆర్‌డీఏ
భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానమయ్యే ఈ రహదారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మే నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. అందుకే మూడు రోజుల క్రితం పురపాలక శాఖా మంత్రి నారాయణ కూడా వచ్చి పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగం అన్ని పనులు ఆపేసి వీటిపైనే ఫోకస్ పెట్టింది. ఇచ్చిన హామీ నెరవేరుస్తాం.