సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్వాసితులకు భరోసా
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:43 PM
సీలేరు పంప్డ్ స్టోరేజీ నిర్వాసిత గ్రామాల్లో అర్హులైన గిరిజనులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఉపాధి కల్పిస్తామని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ తెలిపారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఉపాధి కల్పిస్తాం
జాయింట్ కలెక్టర్ శ్రీపూజ
సీలేరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సీలేరు పంప్డ్ స్టోరేజీ నిర్వాసిత గ్రామాల్లో అర్హులైన గిరిజనులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఉపాధి కల్పిస్తామని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో శ్రీపూజ తెలిపారు. జీకేవీధి మండలం దుప్పులవాడ, సీలేరు పంచాయతీ పరిధిలోని శాండికోరి, బూసుకకొండ, పార్వతీనగర్ గ్రామాల్లో గురువారం సీలేరు కాంప్లెక్సు జెన్‌కో అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సీలేరులో (పార్వతీనగర్ వద్ద) 1,350 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ జెన్‌కో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు వలన నిర్వాసితులు అవుతున్న శాండికోరి, బూసుకకొండ, పార్వతీనగర్ గ్రామాల ప్రజలతో జాయింట్ కలెక్టర్ విడివిడిగా సమావేశమయ్యారు. నిర్వాసితులు ప్రభుత్వం నుంచి ఏయే డిమాండ్లను కోరుకుంటున్నారో వాటిని ఒక్కొక్కటిగా తెలుగులో చదివి వినిపిస్తూ ఏ దశల్లో ఏయే డిమాండ్లు నెరవేరుస్తారో వారికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం వలన శాండికోరి గ్రామంలో భూములను కోల్పోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధర నిర్ణయించి నష్టపరిహారాన్ని అర్హులైన వారి ఖాతాలో జమ చేస్తామని, ఇల్లు కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇంటికి ఒకరు చొప్పున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. దీనిపై నిర్వాసితులు మాట్లాడుతూ తమకు ముందుగా ఉద్యోగ అవకాశాలు, ఇల్లు, నష్టపరిహారం చెల్లించాలని, తరువాత పనులను ప్రారంభించాలని, తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీంటిని కాగితం రూపంలో ఇవ్వాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై జేసీ స్పందిస్తూ ఉద్యోగ అవకాశం అనేది ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తరువాత కల్పిస్తారని, అప్పటి వరకు మెగా కంపెనీ నిర్వహించే పనుల్లో ఈ ప్రాంతీయులకే ముందుగా ప్రాఽధాన్యం ఇస్తుందన్నారు. అలాగే భూమిని కోల్పోతున్న వారి వద్ద ఎటువంటి పట్టాలు, ఆధారాలు లేకపోయినా తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా అర్హులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందుతున్నారు. శాండికోరి గ్రామంలో ఎంత మంది నిర్వాసితులు ఉన్నారు?, ఎంతమంది భూమిని కోల్పోతున్నారు? అనే వివరాలను జీకేవీధి తహశీల్దార్‌ను జేసీ అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు శాండికోరిలో నిర్వాసితులు మొదటిసారిగా తమ గ్రామానికి వచ్చిన జేసీకి బొకే ఇచ్చి దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం బూసుకొండ, పార్వతీనగర్ గ్రామాలకు కూడా వెళ్లి ఆయా గ్రామాల నిర్వాసితులతో మాట్లాడి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వాసితుల్లో ఉన్న అపోహలను ఆమె నివృత్తి చేశారు. నిర్వాసిత గ్రామాల్లో ప్రతీ ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్వాసిత గ్రామాల్లో ఉన్న యువతకు అర్హతలను బట్టి మెగా కంపెనీ పనుల్లో ఉపాధి కల్పించాలని జెన్‌కో అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులను జేసీ ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు వలన సీలేరు గ్రామానికి కూడా ఏమైనా నష్టం వాటిల్లినట్లయితే వారికి కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, సీలేరులోనే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని సీలేరు గ్రామ పెద్దలు, కూటమి నాయకులు జేసీని కోరారు. ఆమె వెంట తహశీల్దార్ హనుమ, ఈఈ బాలకృష్ణ, ఏడీఈ అప్పలనాయుడు, సీలేరు, దుప్పులవాడ సర్పంచ్‌లు పి.దుర్జో, కె.కుమారి, ఎంపీటీసీ సభ్యుడు పిల్లా సాంబమూర్తి, ప్రాజెక్టు నిర్వాసితుల సమన్వయకర్త బీఎం రాము, కూటమి నాయకులు రాము, బాలు, గోవింద్, డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.