మాతా, శిశు ఆరోగ్యానికి భరోసా
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:32 AM
నిరుపేదలైన గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయించే కార్యక్రమాన్ని కలెక్టర్ సూచనలతో ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టారు.
కలెక్టర్ ఆదేశాలతో గర్భిణులకు ఉచితంగా యాంటీ నాటల్ స్కానింగ్
గర్భస్థ శిశువు ఎదుగుదల పర్యవేక్షణకు కీలకం
జిల్లాలో గడిచిన ఏడాది 622 మందికి,
ఈ ఏడాది 453 మందికి నిర్వహణ
విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):
నిరుపేదలైన గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయించే కార్యక్రమాన్ని కలెక్టర్ సూచనలతో ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టారు. జిల్లాలోని డయాగ్నోస్టిక్ సెంటర్ల తాము చేసే మొత్తం పరీక్షల్లో ఐదు శాతం బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువనున్న) కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా నిర్వహించాలని నిబంధన విధించారు. ఈ మేరకు జిల్లాలో సుమారు వందకుపైగా ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ఏటా నిరుపేదలైన గర్భిణులకు పరీక్షలను నిర్వహిస్తూ మాతా, శిశు ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారు.
గర్భం దాల్చిన తరువాత చేయించాల్సిన యాంటీనాటల్ స్కానింగ్‌కు కనీసం రూ.800 నుంచి రూ.1,500 వరకు అవుతుంది. ఆ మొత్తాన్ని వెచ్చించడం ఎంతోమందికి కష్టంగా మారుతోంది. అటువంటి వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
జిల్లాలో వందకుపైగా ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్లల్లో ఏటా 10 నుంచి 12 వేల మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025-26 సంవత్సరం మొత్తం 11,491 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా, అందులో నిరుపేదలైన 622 మందికి ఉచితంగా చేశారు. అలాగే 2026-27లో ఇప్పటివరకు 10,426 మంది గర్భిణులకు స్కాన్లు నిర్వహించగా, వారిలో 453 మంది నిరుపేదలకు ఉచితంగా చేశారు.
స్కానింగ్ చేసేదెప్పుడంటే.?
గర్భధారణ సమయంలో ఆల్ర్టాసౌండ్ సాంకేతికతతో తల్లి కడుపులోని శిశువును పరిశీలించడాన్నే యాంటీనాటల్ స్కానింగ్ (ప్రసవానికి ముందు పరీక్ష) అంటారు. గర్భస్థ శిశువు ఎదుగుదల, గుండె స్పందనలు, శరీర అవయవాల నిర్మాణం, మాయ స్థానం, ఉమ్మనీరు పరిమాణం, తదితర అంశాలను ఈ స్కానింగ్ ద్వారా పరిశీలిస్తారు. గర్భంలో కవలలు ఉన్నారా?, శిశువు ఎదుగుదల ఎలా ఉందనే అంశాలను తెలుసుకునేందుకు ఈ స్కానింగ్ ఉపకరిస్తుంది. శిశువు అవయవాల నిర్మాణాల్లో లోపాలు, ఎదుగుదల సమస్యలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
ఎవరికి చేస్తారంటే?
బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళ అయి ఉండాలి. ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తే...అక్కడి వైద్యులకు ఆర్థిక స్థితిని తెలియజేసి ఉచితంగా స్కాన్ చేయాలని కోరితే సరిపోతుంది. లేదా ఎవరైనా డాక్టర్ సిఫారసు చేసినా స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ఉచితంగా నిర్వహిస్తారు. స్కానింగ్ చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారి కుటుంబ సభ్యులు స్వయగా ఆరోగ్యశాఖ అధికారులను సంప్రతించవచ్చు. స్కానింగ్ ఫలితాలను బట్టి తదుపరి పరీక్షలను కూడా ఉచితంగా చేయించే బాధ్యతను తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు.