బాలికల ఆరోగ్యానికి భరోసా
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:42 AM
గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ జిల్లాలో వంద శాతం లక్ష్యాన్ని సాధించింది. 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాను ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు చివరినాటికి జిల్లాలో 10,755 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలను వేయాలన్నది లక్ష్యంకాగా పది రోజుల ముందే లక్ష్యాన్ని పూర్తిచేశారు.
జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం
14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలు 10,755 మంది
ఈ నెలాఖరులోగా అందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వ ఆదేశం
పది రోజుల ముందే లక్ష్యాన్ని పూర్తిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ జిల్లాలో వంద శాతం లక్ష్యాన్ని సాధించింది. 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకాను ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు చివరినాటికి జిల్లాలో 10,755 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలను వేయాలన్నది లక్ష్యంకాగా పది రోజుల ముందే లక్ష్యాన్ని పూర్తిచేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 28వ తేదీనాటికి 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకాల కార్యక్రమాన్ని మార్చి 11వ తేదీన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడం ద్వారా భవిష్యత్‌లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించడమే ఈ టీకా ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం నిర్ధారించిన వయసు ఉన్న బాలికలు జిల్లాలో 10,658 మంది ఉన్నట్టు గుర్తించారు. మే 31వ తేదీలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ సమయానికి 8,123 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. దీంతో ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పెంచింది. టీకాలు వేయాల్సిన మిగిలిన పాటు జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 14 ఏళ్లు నిండి, 15వ ఏటలోకి వచ్చే బాలికలకు కూడా వ్యాక్సిన్ వేయాలని ఆదేశించింది. దీంతో జిల్లాలో మరో 97 మందిపెరిగి, ఈ సంఖ్య 10,755కి చేరింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల వారీగా ఆయా వయసున్న బాలికలను గుర్తించి టీకాలు వేయడంతో గడువుకన్నా పది రోజుల ముందే లక్ష్యాన్ని చేరుకున్నారు.
తల్లిదండ్రులకు అవగాహనతో...
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది జిల్లాలో 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలను గుర్తించి, హెచ్‌పీవీ టీకా ప్రాధాన్యాన్ని వారి తల్లిదండ్రులకు వివరించడంతోపాటు పూర్తి అవగాహన కల్పించారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ కుమార్తెలకు టీకా వేయించడానికి ముందుకు వచ్చారు.
ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నాం
డాక్టర్ చంద్రశేఖర్, డీఐఓ
భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు నుంచి బాలికలను రక్షించేందుకు ప్రభుత్వం ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టింది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యాధికారులు సహకరించారు. ఈ నెలాఖరునాటికి 14 ఏళ్లు నిండి 15వ సంవత్సరంలో వచ్చే బాలికల్లో ఇంకా ఎవరైనా టీకా వేయించుకోకపోతే వెంటనే సమీపంలోని పీహెచ్‌సీ/ సీహెచ్‌సీలో సంప్రదించాలి. వైద్య ఆరోగ్య శాఖ కమిషర్ తాజా ఉత్తర్వుల ప్రకారం హెచ్‌పీవీ టీకా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది.