ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల పరారీ
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:16 AM
మండలంలోని వంగసార గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల నుంచి పరారైన ఇద్దరు విద్యార్థినులను చింతపల్లి పోలీసులు 12 గంటల వ్యవధిలో పట్టుకున్నారు. విద్యార్థినులను డీఎస్పీ సీహెచ్. తిరుమలరావు కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.
సెలవులకు ఇళ్లకు పంపలేదని గోడ దూకి..
హెచ్‌ఎం ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు
చింతపల్లి బస్టాండ్‌లో పట్టుకున్న పోలీసులు
కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించిన డీఎస్పీ
చింతపల్లి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వంగసార గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో మూడు రోజులు సెలవులు వచ్చినా ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపించలేదు. దీంతో శనివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థినులు గోడ దూకి బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న హెచ్‌ఎం ప్రసాదరావు వెంటనే చింతపల్లి పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. స్థానిక సీఐ బి.సింహాచలం ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. డీఎస్పీ వెంటనే సీఐ పర్యవేక్షణలో అన్నవరం ఎస్‌ఐ సాయికుమార్, చింతపల్లి ఎస్‌ఐ జి.వీరబాబులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థినుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే విద్యార్థినులు స్నేహితుల ఇంటిలో బస చేశారు. ఆదివారం చింతపల్లి బస్టాండ్‌లో విద్యార్థినులు ఉండడంతో పోలీసులు పట్టుకున్నారు. వారిని తీసుకువచ్చి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో డీఎస్పీ కౌన్సెలింగ్ చేశారు. అనంతరం విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల నుంచి విద్యార్థులు అనుమతి లేకుండా బయటకు వెళ్లిపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హెచ్‌ఎం సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థినులను సురక్షితంగా పట్టుకోగలిగామన్నారు.