రక్తహీనతతో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:37 PM
మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని రక్తహీనతతో మంగళవారం వేకువజామున మృతి చెందింది.
పాఠశాల ఎదుట మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన
పెదబయలు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని రక్తహీనతతో మంగళవారం వేకువజామున మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థిని తల్లిదండ్రులు, గిరిజన సంఘం నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. కిముడుపల్లి పంచాయతీ మచ్చేపల్లి గ్రామానికి చెందిన వంతాల నందిని(13) తురకలవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఆ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో పాఠశాల సిబ్బంది పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో రక్తహీనత తీవ్రంగా ఉండడంతో పాటు తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. ఆ బాలిక పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ ఆ బాలిక చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపిస్తూ గిరిజన సంఘం నాయకులు బాబూజీ, మాధవ్, కిముడుపల్లి సర్పంచ్ శోభారాణి ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సమాచారం తెలిసి పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.