Share News

మొక్కుబడిగా...

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:39 AM

విశాఖ ఉత్సవాలు చప్పగా సాగుతున్నాయి. సెలబ్రిటీల సందడే లేదు.

మొక్కుబడిగా...

  • ‘ఉత్సవ్‌’కు కొరవడిన ప్రణాళిక

  • నామమాత్రంగా మారిన జిల్లా అధికారులు

  • నిర్వహణ మొత్తం ఈవెంట్‌ సంస్థకు అప్పగింత

  • రూ.8 కోట్లకు కాంట్రాక్టు...స్టాళ్ల అద్దెలు కూడా వారికే...

  • తూతూమంత్రంగా కార్యక్రమాలు

  • వేదికపై సినిమాల ప్రమోషన్‌ కార్యక్రమాలు

  • ఆర్కే బీచ్‌ మినహా సాగర్‌నగర్‌, భీమిలిల్లో చప్పుడే లేదు

విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉత్సవాలు చప్పగా సాగుతున్నాయి. సెలబ్రిటీల సందడే లేదు. జిల్లా అధికారులను డమ్మీలుగా చేసి ఉత్సవాల నిర్వహణ బాధ్యత మొత్తం ఈవెంట్‌ సంస్థకు అప్పగించారు. ఎప్పుడూ విశాఖపట్నంలో మూడు రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలను ఈసారి అనకాపల్లి, అల్లూరి జిల్లాలతో కలుపుకొని తొమ్మిది రోజులు ఘనంగా చేస్తామని ప్రకటించారు. ఏ రోజున ఏ కార్యక్రమానికి ఎవరు వస్తారనే ప్రణాళిక లేకుండానే శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో స్టాళ్ల కేటాయింపు, వాటికి అద్దెల వసూళ్లు వంటి అంశాలు గతంలో పర్యాటక శాఖ పరిధిలో ఉండేవి. ఈసారి ఆ బాధ్యత కూడా ఈవెంట్‌ సంస్థకే అప్పగించారు. ఆర్కే బీచ్‌లో సుమారు 150 పైచిలుకు స్టాళ్లు ఏర్పాటుచేశారు. టెంట్లకు హోటళ్ల యజమానుల నుంచి రూ.50 వేల నుంచి రూ.90 వేల వరకు అద్దె వసూలు చేశారు. వాటికి అదనంగా విద్యుత్‌ బిల్లులు కూడా ఉంటాయని అడ్వాన్సులు తీసుకున్నారు. ఈవెంట్‌ సంస్థ ప్రతినిధులు అసలు జిల్లా అధికారులను ఖాతరు చేయడం లేదు. ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా చేశారు. ప్రతి రోజూ డ్రోన్‌ షో ఉంటుందని ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన ఉత్సవాలు ప్రారంభించారు. గత మూడు రోజుల్లో ఒక్కరోజు కూడా ప్రదర్శించలేదు.

జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో 20 వేదికలపై 500కు పైగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీటీడీసీ సీఈవో ఆమ్రపాలి ప్రకటించారు. 26 కి.మీ. పొడవైన బీచ్‌లో ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఉంటాయన్నారు. విశాఖ ఉత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. ఆ రోజు యాంకర్‌గా సుమను పెట్టి, సింగర్‌ సునీతను తీసుకువచ్చి పాటలు పాడించారు. ఆదివారం బీచ్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. ఆ రోజున ఎక్కువ మంది సెలబ్రిటీలను తీసుకువచ్చి భారీ కార్యక్రమాలు నిర్వహిస్తారని భావిస్తే లోకల్‌ యాంకర్‌ను పెట్టి, వయొలిన్‌ కళాకారిణి కామాక్షితో మమ అనిపించారు. అదే వేదికపై ‘యుఫోరియా’ సినిమా బృందంతో ప్రమోషన్‌ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కూడా నిర్వాహకులు డబ్బులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సోమవారం రాత్రి కార్యక్రమానికి ఎవరు వస్తారో సాయంత్రం వరకూ ప్రకటించలేదు. ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా భీమిలి బీచ్‌లో ఇప్పటివరకూ కనీసం అదనపు విద్యుద్దీపాలు కూడా పెట్టలేదు. సాగర్‌నగర్‌ బీచ్‌లో సందడే లేదు. రుషికొండ బీచ్‌లో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ పేరుతో హెలికాప్టర్‌ రైడ్‌ కొత్తగా పెట్టారు. దానికి రూ.5 వేలు ధర నిర్ణయించడంతో ఆ చుట్టుపక్కలకు ఎవరూ వెళ్లడం లేదు. అధికారుల మధ్య సమన్వయం లేదు. విశాఖ ఉత్సవాల్లో వీఎంఆర్‌డీఏ ప్రతిసారి సుమారు 200 రకాల పుష్పాలతో ఫ్లవర్‌ షో నిర్వహిస్తుంది. ఇప్పటివరకూ ఆ ప్రదర్శన ఏర్పాటుకాలేదు. చివరి మూడు రోజులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎక్కువ ఈవెంట్లు చేస్తున్నామని చెప్పుకోవడానికి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, మిస్‌ వైజాగ్‌ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. వాటికి ఎంపిక బాధ్యత కూడా ఈవెంట్‌ సంస్థకే వదిలేశారు. ఈ ఉత్సవాల వల్ల రూ.500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని పర్యాటక శాఖ పేర్కొంది. పర్యాటకులు, ప్రజలను ఆకర్షించేలా కార్యక్రమాలు ఏమీ లేకపోవడంతో ఉత్సవ్‌ ఆర్కే బీచ్‌రోడ్డులో గ్రామ జాతర తరహాలో నడుస్తోంది.


ఉత్సవ్‌లో రిపబ్లిక్‌ డే

ముఖ్య అతిథులు లేకుండానే 3వ రోజు ఉత్సవం

స్పెషల్‌ సెలబ్రిటీగా గాయని కనికా కపూర్‌ రాక

విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉత్సవ్‌లో మూడో రోజు సోమవారం గణతంత్ర దినోత్సవ ప్రదర్శనలకు పెద్దపీట వేశారు. దేశభక్తిని చాటే, భారత సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే కార్యక్రమాలు నిర్వహించారు. రిపబ్లిక్‌ డే సెలవు కావడంతో కార్యక్రమాల వీక్షణకు జనం బాగానే వచ్చారు. అయితే ముఖ్యఅతిఽఽథులు, జిల్లా అధికారులు ఎవరూ లేకుండానే కార్యక్రమం జరగడం విశేషం. సాయంత్రం ఆరు గంటలకు ఆర్‌కే బీచ్‌లో ప్రారంభం కావలసిన ప్రధాన కార్యక్రమం రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 8.15 గంటలకు మొదలు పెట్టారు. మూడో రోజు ఉత్సవాలకు సింగర్‌ కనికా కపూర్‌ను స్పెషల్‌ సెలబ్రిటీగా ప్రకటించారు. ఆమె పాడిన పాటలు వింటూ ప్రేక్షకులు కాలక్షేపం చేశారు. డ్రోన్‌ షో ప్రతి రోజూ ఉంటుందని ప్రకటించారు. ఇంతవరకూ దానిని ప్రదర్శించనే లేదు. బీచ్‌లో హోటళ్లు ఏర్పాటుచేసిన ఫుడ్‌ స్టాళ్ల వద్ద మాత్రం సందడి అధికంగానే కనిపించింది. మంగళవారం నాటి ఉత్సవాలకు ఎవరు సెలబ్రిటీ, ఏయే కార్యక్రమాలు ఉంటాయో రాత్రి పది గంటల వరకూ ప్రకటించలేదు.

Updated Date - Jan 27 , 2026 | 01:39 AM