కార్పొరేటర్‌గా ప్రమాణం చేయకుండానే...
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:16 AM
గత నెల 30న జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచిన మేయర్‌తోపాటు 120 మంది కార్పొరేటర్లు ఈనెల 23న జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ అధికారులు నోటీసులు పంపడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తాము ముందుగా కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే కౌన్సిల్‌లో సభ్యులుగా అధికారిక గుర్తింపు లభిస్తుందని, ఆ పని చేయకుండా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటుహక్కు ఎలా వినియోగించుకుంటామని ప్రశ్నిస్తున్నారు.
డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలంటూ నోటీసులు ఇవ్వడంపై కార్పొరేటర్ల ఆశ్చర్యం
విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):
గత నెల 30న జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచిన మేయర్‌తోపాటు 120 మంది కార్పొరేటర్లు ఈనెల 23న జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ అధికారులు నోటీసులు పంపడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తాము ముందుగా కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే కౌన్సిల్‌లో సభ్యులుగా అధికారిక గుర్తింపు లభిస్తుందని, ఆ పని చేయకుండా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటుహక్కు ఎలా వినియోగించుకుంటామని ప్రశ్నిస్తున్నారు. జీవీఎంసీ కార్పొరేటర్లుగా ఎన్నికైన వారితో జీవీఎంసీ ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ ముందుగా ప్రమాణం చేయించాలి. ఆ తర్వాత జీవీఎంసీ రికార్డుల్లో కార్పొరేటర్‌గా సంతకం చేయాల్సి ఉంటుంది. మేయర్‌తో కూడా ఇదేవిధంగా జీవీఎంసీ ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించాలి. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక అధికారి నోటిఫికేషన్ జారీచేసి, ప్రక్రియను ప్రారంభించాలి. కానీ జీవీఎంసీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడంపై కార్పొరేటర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ముందు కార్పొరేటర్‌గా ప్రమాణం చేసేందుకు 23న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని నోటీసు ఇచ్చి, డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరుకావాలని ఆహ్వానిస్తూ మరొక నోటీస్ ఇవ్వాలని, ఒకవేళ అలాకాకపోయినా రెండు అంశాలను ఒకే నోటీసులో పేర్కొనవచ్చునని చెబుతున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులకు ఫోన్ చేస్తే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చామని సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు. కార్పొరేటర్‌గా గుర్తింపు పొందకుండా డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఓటుహక్కు ఎలా వినియోగించుకుంటామని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.