Share News

స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:27 PM

ఈ నెల 23న ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సహా అనేక మంది ప్రముఖులు రానున్నారని, అందువల్ల పటిష్ఠ బందోబస్తు, ఏర్పాట్లు చేయాలని అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపనకు పకడ్బందీ ఏర్పాట్లు
స్టీల్‌ప్లాంట్‌ భూమి పూజ ఏర్పాట్లను పరిశీలిస్తున్న హోం మంత్రి అనిత

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌ రాక

సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు

అధికారులకు హోం మంత్రి అనిత ఆదేశం

నక్కపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 23న ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సహా అనేక మంది ప్రముఖులు రానున్నారని, అందువల్ల పటిష్ఠ బందోబస్తు, ఏర్పాట్లు చేయాలని అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శనివారం స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ చేసే ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. హెలీప్యాడ్‌ నిర్మాణం, వాహనాల రాక కోసం ఏర్పాటు చేసే రహదారులు, సభావేదిక, వాహనాల పార్కింగ్‌, తదితర విషయాలపై ఆమె అధికారులతో మాట్లాడారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, సీఐ మురళి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయని, ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా వుండాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. శనివారం స్థానికంగా ఉన్న క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం సమన్వయకమిటీ, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జిల సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన అనేక అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. త్వరలో నక్కపల్లి సీహెచ్‌సీని రూ 32.89 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్పుచేస్తున్నట్టు ఆమె చెప్పారు. పెనుగొల్లు ఆస్పత్రి అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరైనట్టు చెప్పారు. నక్కపల్లిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి కూడా అనుమతులు వచ్చాయని చెప్పారు. ఎస్‌.రాయవరం మండలం పెద ఉప్పలం-లింగరాజుపాలెం మధ్య వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు, కోటవురట్ల మండలం ఇందేశమ్మవాక వద్ద కొండను తొలచి రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లు నిధులు మంజూరైనట్టు చెప్పారు. త్వరలో నియోజకవర్గంలో జాతీయ స్థాయి గుర్తింపు వున్న మరో పాఠశాల ఏర్పాటుకానుందని చెప్పారు. ఉపాధి అవకాశాల కోసం నక్కపల్లి మండలంలో స్వయం పేరుతో డ్రై ఫిష్‌ యూనిట్‌, రాజయ్యపేటలో బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఈ సమావేశంలో నియోజకవర్గం టీడీపీ సమన్వయకమిటీ ప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:27 PM