Share News

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:36 AM

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

నేడు నోవాటెల్‌ హోటల్‌లో జరగనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి హాజరుకానున్న ద్రౌపది ముర్ము

వేదికను పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో మంగళవారం జరగనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇంకా కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వేదిక, ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం సాయంత్రం పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో దేశ ప్రథమ పౌరురాలు పాల్గొనడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు హోంమంత్రి వెల్లడించారు. ఆమెతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్నాతకోత్సవం జరగనున్న హాలును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ, జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు లతా మాధురి, మణికంఠ, ఆర్డీవోలు దిలీప్‌ చక్రవర్తి, సంగీత్‌ మాధుర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి పర్యటన వివరాలు...

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం వస్తున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రపతి మంగళవారం ఉదయం 10.25 గంటలకు ఢిల్లీ నుంచి భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టులో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డుమార్గాన మధ్యాహ్నం 1.05 గంటలకు నగరంలోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నోవాటెల్‌ హోటల్‌లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.20 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళతారు. కాగా మంగళవారం సాయంత్రం వాతావరణం అనుకూలించకపోతే రాత్రికి ఐఎన్‌ఎస్‌ చోళాలో రాష్ట్రపతి బస కోసం ఏర్పాట్లుచేశారు.

Updated Date - Jun 30 , 2026 | 01:36 AM