మరిడి మహాలక్ష్మి ఉత్సవాలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:13 AM
నర్సీపట్నం మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగలో భాగంగా శనివారం చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
- 31న పెద్ద జాగారం, 1న పండుగ,
- ఊరంతా విద్యుద్దీపాలతో తోరణాలు, సెట్టింగ్‌లు
నర్సీపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగలో భాగంగా శనివారం చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు అమ్మవారిని బంగారు నగలతో అలకరించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రెండేళ్లకు ఒకసారి మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పండుగ ఏర్పాట్లు ప్రతిష్ఠాత్మంగా చేస్తున్నారు. పట్టణమంతా విద్యుద్దీపాల తో తోరణాలు, భారీ సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 31న రాత్రి పెద్ద జాగరం భారీ ఎత్తున నిర్వహించన్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో స్టేజి ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేశారు. ఒకటో తేదీన అమ్మవారి పండుగ, అదే రోజు సాయంత్రం సంబరం ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీ కాలనీ నుంచి పూల బాణాలు, డప్పులు, నేల డ్యాన్సులు, కాంతార, శక్తి వేషాలతో సంబరాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విదేశాల్లో ఉంటున్న నర్సీపట్నం వాసులకు ఫోన్లు చేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్నేహితులు, బంధువులను పండక్కి పిలిచి కుటుంబ సమేతంగా పండుగను ఆనందంగా గడపాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో లక్ష మందికి పైగా హాజరు కావచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మునిసిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగ ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం నిర్వహణ విషయంలో మునిసిపల్ కమిషనర్ సురేంద్ర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 100 మందితో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.