Share News

చందనోత్సవానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:31 AM

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని (నిజరూప దర్శనం) ఏప్రిల్‌ 20న నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె.వెంకటరావు తెలిపారు.

చందనోత్సవానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

ఉదయం 5 గంటల వరకూ మాత్రమే ప్రముఖులకు అంతరాలయ దర్శనాలు

తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 10 గంటల వరకూ సామాన్య భక్తులకు అవకాశం

ఈసారి మూడు రోజుల ముందే టికెట్ల అమ్మకం

కొండ దిగువనే వాహనాలకు పార్కింగ్‌

అక్కడ నుంచి దేవస్థానం ఏర్పాటుచేసిన బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది

ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు

సింహాచలం దేవస్థానం ఈఓ జె.వెంకటరావు

సింహాచలం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని (నిజరూప దర్శనం) ఏప్రిల్‌ 20న నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె.వెంకటరావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ స్వామివారి నిజరూప దర్శనానికి ఈ ఏడాది సుమారు 1.4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులు తొలిదర్శనం చేసుకుంటారని, ఆ తరువాత ఉదయం ఐదు గంటల వరకు మాత్రమే ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పించాలని నిర్ణయించామన్నారు. కేటాయించిన స్లాట్ల ప్రకారం ఐదు గంటల వరకు మాత్రమే ప్రముఖులకు అంతరాలయ దర్శనాలు ఉంటాయన్నారు. సాధారణ భక్తులకు తెల్లవారుజామున మూడు నుంచి రాత్రి పది గంటల వరకూ నిర్విరామంగా నిజరూప దర్శనం సంతృప్తికరంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉచిత, రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల ద్వారా దర్శనాలు చేసుకునే భక్తుల కోసం పటిష్ఠమైన క్యూల నిర్మాణం జరుపుతున్నట్టు పేర్కొన్నారు. క్యూలో పది వేల మంది నిరీక్షించేందుకు వీలుంటుందన్నారు. గంటకు సుమారు ఆరు వేల మంది దర్శించుకుంటారని అంచనా వేశామని చెప్పారు. గతానికి భిన్నంగా దర్శన టికెట్లు విక్రయాలను మూడు రోజుల ముందే ముగిస్తామని చెప్పారు. బయటకు వచ్చే మార్గం తక్కువ కావడంతో దక్షిణ ద్వారం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తుల క్యూ మార్గంలో మూడు చోట్ల ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు కొండ దిగువన, ఎగువన ప్రత్యేక స్థలాలు ఎంపిక చేసినట్టు ఈవో తెలిపారు. భక్తుల రాకపోకల కోసం దేవస్థానం 70 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుందన్నారు. చందనోత్సవానికి వచ్చే ప్రముఖులతో సహా అందరూ తమ వాహనాలను కొండ దిగువనే నిలిపివేసి దేవస్థానం ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాల్లో మాత్రమే సింహగిరికి రాకపోకలు సాగించాల్సి ఉంటుందని ఈఓ స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారుల సహాయ సహకారాలతో చందనోత్సవం విజయవంతానికి కృషి చేయనున్నట్టు ఈఓ చెప్పారు.

Updated Date - Mar 03 , 2026 | 01:31 AM