Share News

పది పరీక్షలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:33 AM

జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు నిర్ణీత రోజుల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించి పోలీసు స్టేషన్లలో భద్ర పరిచారు.

పది పరీక్షలకు ఏర్పాట్లు
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు (ఫైల్‌ ఫొటో)

16 నుంచి ఏప్రిల్‌ ఒకటి వరకు నిర్వహణ

మొత్తం విద్యార్థులు 21,017

పరీక్షా కేంద్రాలు 102

మండల కేంద్రాలకు చేరిన ప్రశ్నాపత్రాలు

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

పరీక్షల తేదీల్లో విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

నర్సీపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు నిర్ణీత రోజుల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఇప్పటికే మండల కేంద్రాలకు తరలించి పోలీసు స్టేషన్లలో భద్ర పరిచారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,309 మంది, ప్రైవేటు స్కూళ్ల నుంచి 6,268 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరితోపాటు గత ఏడాది పదో తరగతి పరీక్షలో ఫెయిల్‌ అయిన 440 మంది కంపార్ట్‌మెంట్‌ విద్యార్థులు కూడా పరీక్షలు రాయనున్నారు. మొత్తం 21,017 మంది విద్యార్థుల కోసం 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. మండల విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణలో చూసిరాతలకు తావులేకుండా పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్లు పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తారు. కాగా పరీక్షలు జరిగే రోజుల్లో పదో తరగతి విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల హాల్‌టికెట్‌ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు ప్రకటించారు. పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు నుంచి, పరీక్ష ముగిసిన గంట తరువాత వరకు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా బస్సులు నడపాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

శత శాతం ఉత్తీర్ణతకు తీవ్ర కృషి

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘వంద రోజుల ప్రణాళిక’ను అమలు చేశారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాల వారీగా చదివించి, టెస్టులు పెడుతున్నారు. గత నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో తగిన మార్కులు రాని విద్యార్థులను సమీపంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉంచి చదివిస్తున్నారు. మళ్లీ ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రాండ్‌ టెస్టు నిర్వహించారు.

Updated Date - Mar 11 , 2026 | 12:33 AM