ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:46 AM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జరగనున్న పరీక్షలకు ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు.
- రేపటి నుంచి ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 26 కేంద్రాల్లో నిర్వహణ
- హాజరుకానున్న 14,608 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
- 260 మంది ఇన్విజిలేటర్ల నియామకం
- జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు
పాడేరురూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జరగనున్న పరీక్షలకు ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాడేరు, రంపచోడవరం జిల్లాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 7,861 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 6,747 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. 26 కేంద్రాలు పరీక్షలు నిర్వహించను న్నామని చెప్పారు. ఇందు కోసం 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లను నియమించామన్నారు. అలాగే 260 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని, రెండు స్క్వాడ్లు అల్లూరి, రెండు స్క్వాడ్లు రంపచోడవరం జిల్లాలో పర్యవేక్షిస్తాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నామన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లను ఏ కళాశాల యాజమాన్యం ఆపడానికి వీల్లేదన్నారు. విద్యార్థి హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.