Share News

గ్రేటర్‌ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:00 AM

జీవీఎంసీ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రేటర్‌ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ రావచ్చునని అధికారుల అంచనా

అందుకు తగ్గట్టుగా సన్నద్ధం

వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాలు విడుదల

జోన్‌లవారీగా అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా సమర్థంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు శనివారం వార్డుల వారీగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ప్రజల నుంచి రెండు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత రిజర్వేషన్‌లు ఖరారు చే సే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబరు నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. లేనిపక్షంలో 16వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.తొమ్మిది వేల కోట్లు రాష్ట్రం కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు, చివరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం రాష్ట్రంలోని వంద మునిసిపాలిటీలు, 16 మునిసిపల్‌ కార్పొరేషన్లలో 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసింది. రెండు విడతల్లో మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీవీఎంసీకి మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించనున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల జాబితాలను ప్రకటించిన అధికారులు వార్డుల రిజర్వేషన్‌ ఖరారు చేసేందుకు అత్యంత కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించే ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు శనివారం జాబితాలను విడుదల చేశారు. ప్రజల నుంచి రెండు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను విడుదల చేస్తారు. ఆ వివరాలు ఆధారంగా వార్డుల రిజర్వేషన్‌ ప్రకటించి ఎన్నికలకు సిద్ధమని ప్రభుత్వానికి తెలియజేస్తారు.

ఇదిలావుండగా ఎన్నికలకు సంబంధించి జోనల్‌ స్థాయిలో అన్ని రాజకీయపార్టీలతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ప్రతిరోజూ అదనపు కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు, ఎలక్టోరల్‌ అధికారులు, అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు జీవీఎంసీ ఎన్నికలకు 1,800 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేసిన అధికారులు దశల వారీగా సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. జీవీఎంసీ వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ జారీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అధికారులు పడుతున్న హడావిడి చూస్తుంటే అక్టోబరు నెలాఖరులోగానే జీవీఎంసీకి కొత్త పాలకవర్గం కొలువుదీరడం ఖాయమనిపిస్తోంది.

Updated Date - Sep 27 , 2026 | 01:00 AM