Share News

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:01 AM

త్వరలో జరగబోయే జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులను ఆదేశించారు.

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

జోన్‌ల వారీగా పోలింగ్‌ కేంద్రాల వివరాలు సిద్ధం చేయండి

అధికారులకు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశం

విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):

త్వరలో జరగబోయే జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ఎన్నికకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై అదనపు కమిషనర్లు, విభాగాధిపతులు, జోనల్‌ కమిషనర్లు, ఇతర ముఖ్య అధికారులతో గురువారం ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసే ఆదేశాలు, మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈ మేరకు ముందుగానే జోన్‌ల వారీగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసుకోవడం, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడం, పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ లేకుండా జోనల్‌ కమిషనర్లు జాగ్రత్త వహించాలన్నారు. వార్డుల పునర్విభజనపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వాటిపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సీసీపీ ఎ.ప్రభాకరరావును ఆదేశించారు.

Updated Date - Aug 21 , 2026 | 01:01 AM