అరకు ఉత్సవ్‌కు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:27 PM
అరకు ఉత్సవ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.
నేటి నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
అరకులోయ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): అరకు ఉత్సవ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఉత్సవ్ ప్రధాన వేదిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను ఐజీ గోపీనాథ్ జెట్టీ, టూరిజం ఎండీ ఆమ్రపాలి, ఎస్పీ అమిత్‌బర్ధార్, ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంప్రదాయం ప్రతిబింబించేలా ఉత్సవ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గురువారం మధ్యాహ్నం ఉత్సవ్ ప్రారంభమవుతుందన్నారు. ఫిబ్రవరి 1 వరకు పర్యాటకులకు మధురానుభూతి కలిగేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
సీఎం పర్యటన రద్దు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం అరకులోయ పర్యటన రద్దయింది. విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్లనున్నారు. వాస్తవానికి బుధవారం రాత్రి వరకు సీఎం అరకులోయ పర్యటనపై యంత్రాంగం తర్జనభర్జన పడ్డారు. గురువారం ఉదయం బారామతిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అంత్యక్రియల్లో పాల్గొన్న తరువాత సీఎం చంద్రబాబునాయుడు అరకులోయ వచ్చేలా చేయాలని భావించినప్పటికీ సమయం కుదరకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేశారు. దీంతో అరకు ఫెస్ట్- 2026ను రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే వచ్చే నెల 1 వరకు అరకు ఉత్సవ్ జరగనుండడంతో అవకాశం కుదిరితే ఏదో ఒక రోజు సీఎం లేదా డిప్యూటీ సీఎం హాజరవుతారని జిల్లా యంత్రాంగం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.