మంత్రి లోకేశ్ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - May 12 , 2026 | 12:36 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పాడేరులో పర్యటించనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు జేసీ శ్రీపూజ ఆదేశం
ప్రొటోకాల్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
పాడేరు, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పాడేరులో పర్యటించనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ ఆదేశించారు. మంత్రి లోకేశ్ పర్యటనపై కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా మంత్రి లోకేశ్ పర్యటనలో ప్రొటోకాల్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే హెలీప్యాడ్ వద్ద చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌ను పక్కాగా చూడాలన్నారు. అందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనులు చేయాలని సూచించారు. మంత్రి కాన్వాయ్ పార్కింగ్, ఇతర వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. కాన్వాయ్‌లో వాహనాన్నీ ఫిట్‌నెస్‌గా ఉండేలా చూడాలని, ఫైరింజన్, అంబులెన్సులు సైతం పక్కా కండీషన్‌లో ఉండాలన్నారు. హెలీప్యాడ్ నుంచి లగిశపల్లి, కాడెలి, నక్కలపుట్టు మీదుగా ఎస్‌పీ కార్యాలయం సమీపంలోని తుమ్మరమెట్ట వద్దకు మంత్రి లోకేశ్ చేరుకుంటారన్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లను పరిశుభ్రం చేయాలని, మంత్రి కార్యక్రమానికి తరలివచ్చే జనానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను అప్పగించిన ఆయా శాఖల అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏఎస్‌పీ నవజ్యోతిమిశ్రా, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.