ఆర్నబ్ అలజడి
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:36 AM
‘ఆర్నాబ్’ సోమవారం రాత్రికి తీవ్ర తుఫాన్‌గా బలపడింది.
అంతటా అప్రమత్తం
తుఫాన్ సహాయక చర్యలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
54 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం
భారీ వర్షాలు, గాలుల తీవ్రతకు ప్రభావితమయ్యే ప్రాంతాలు గుర్తింపు
అధికారులతో కలెక్టర్ సమీక్ష
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
‘ఆర్నాబ్’ సోమవారం రాత్రికి తీవ్ర తుఫాన్‌గా బలపడింది. ఇది బుధవారం ఉదయం యానాం వద్ద తీరం దాటనున్నదని, ఉత్తరకోస్తాపై విరుచుకుపడనున్నదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సోమవారం ఉదయం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. సాయంత్రం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో తుఫాన్ ప్రభావానికి గురయ్యే ప్రాంతాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. అత్యవసరమైన సందర్భాల్లో సుమారు 30 వేల మంది కోసం 54 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. గాలులకు కూలిపోయే చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు, కొండచరియలు తొలగించడానికి, ప్రజలను ఆదుకునేందుకు పది జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలను ఏర్పాటుచేశారు. నౌకాదళం, కోస్టుగార్డు బృందాలను అప్రమత్తం చేశారు.
జీవీఎంసీ, ఈపీడీసీఎల్ సంస్థలు, ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలు సుమారు 100 టిప్పర్లు, 120 కోత మిషన్లు, 100 వరకు క్రేన్లు, ట్రాక్టర్లు, 40 వైర్‌లెస్ సెట్లు, 1000 ఇసుక బస్తాలు, 22 బోట్లు, 282 మంది గజ ఈతగాళ్లు, 300 వరకు లైఫ్ జాకెట్లు, ఇతర యంత్రాలను సిద్ధంగా ఉంచుకున్నాయి. ప్రధాన శాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ కమిషనరేట్‌లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ కోరారు. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వెళ్లవద్దని సూచించారు. సోమవారం రాత్రి నుంచి గాలులు, వర్షాలు ప్రారంభమవుతాయని, మంగళ, బుధవారాల్లో అతిభారీగా, అక్కడక్కడా అత్యంత భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంటూ లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
రైతుబజార్లు కిటకిట!
ఉదయం పదకొండు గంటలకల్లా కూరగాయలన్నీ విక్రయం
ఉల్లి, టమాటా కోసం బారులు
తుఫాన్ ఎఫెక్ట్
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ హెచ్చరికతో రైతుబజార్లలో కూరగాయలన్నీ అయిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ వల్ల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, జనజీవనం స్తంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. గతంలో హుద్‌హుద్ తుఫాన్ అనుభవం ఉండడంతో ముందుగానే వారం రోజులకు సరిపడా నిత్యవసరాలు, కూరగాయలను కొనుగోలు చేయడానికి సోమవారం రైతుబజార్లకు తరలివచ్చారు. ముఖ్యంగా ఉల్లిపాయలు, టమాటా, బంగాళాదుంపలతో పాటు అందుబాటులో ఉన్న కూరగాయలు రెండేసి కిలోలు చొప్పున కొనుగోలు చేశారు. ఉల్లి రూ.54, టమాటా రూ.36 కాగా మిగిలిన కూరగాయల ధరలన్నీ అందుబాటులోనే ఉండడంతో రైతులు తెచ్చిన సరకులు ఉదయం 11 గంటలకే అయిపోయాయి. ఉల్లి, టమాటా కోసం కొన్ని రైతుబజార్లలో క్యూలైన్‌లో నిల్చోవలసి వచ్చింది. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, అక్కయ్యపాలెం, గోపాలపట్నం, కంచరపాలెంలలో రాత్రి బజార్లు ఉన్నా ఎంవీపీ, సీతమ్మధార తప్ప మిగిలినచోట్ల సాధారణంగా పెద్ద సందడి ఉండదు. కానీ తుఫాన్ హెచ్చరికలతో మిగిలిన రాత్రి బజార్లు కూడా సోమవారం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మంగళవారం కొన్ని, బుధవారం మరికొన్ని బజార్లకు సెలవు కావడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి ముందే అన్నీ కొనుక్కున్నారు. కొందరైతే కోడిగుడ్లు డజను, రెండు డజన్లు కాకుండా మొత్తం ట్రేలనే కొనుగోలు చేసి పట్టుకువెళ్లడం కనిపించింది. బేకరీలు కూడా రద్దీగా మారాయి. బ్రెడ్లు, కారప్పూస, కారంబూందీ, మిక్చర్ వంటివి బాగా అమ్ముడుపోయాయి. సూపర్‌బజార్లలో టెట్రా ప్యాకెట్ మిల్క్‌కు డిమాండ్ ఏర్పడింది. దీనిపై మార్కెటింగ్ శాఖాధికారులు మాట్లాడుతూ, మంగళవారం బజార్లకు అన్ని రకాల కూరగాయలు పెద్ద మొత్తంలో తెప్పించే ఏర్పాట్లు చేశామని, ఉదయాన్నే వచ్చి తీసుకోవచ్చునని తెలిపారు.
నేడు, రేపు పార్కులన్నీ మూసివేత
మూడు రోజులపాటు రుషికొండ బీచ్‌లోకి ప్రవేశం నిషేధం
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ కారణంగా మంగళవారం నుంచి జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను మూడు రోజులు మూసివేస్తున్నట్టు పర్యాటక శాఖాధికారులు తెలిపారు. ముఖ్యంగా రుషికొండ బీచ్‌లోకి మంగళ, బుధ, గురువారాల్లో ఎవరినీ అనుమతించవద్దని ఏపీ పర్యాటక సంస్థ ఆదేశించినట్టు జిల్లా పర్యాటక శాఖాధికారిణి మాధవి సోమవారం తెలిపారు. అదేవిధంగా వీఎంఆర్‌డీఏకు సంబంధించి కైలాసగిరి, సిటీ సెంట్రల్ పార్కు, తెన్నేటి పార్కు, కురుసుర సబ్‌మెరైన్, టీయూ-142, యుహెచ్-3హెచ్, సీ హ్యారియర్ హెలికాప్టర్ మ్యూజియాలను మంగళ, బుధవారాల్లో సందర్శనకు వీలు లేకుండా మూసివేస్తున్నట్టు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. మళ్లీ వర్షాలు తెరిపిచ్చిన తరువాతే అన్నింటినీ తెరుస్తామన్నారు.
పలు పాసింజర్ రైళ్లు రద్దు
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ ముందస్తు చర్యలలో భాగంగా విశాఖ-కాకినాడ పోర్టు-విశాఖ (17268/17267), విశాఖ-పార్వతీపురం-విశాఖ (07268/07267), విశాఖ-రాజమండ్రి-విశాఖ (67285/67286) పాసింజర్ రైళ్లను మంగళ, బుధవారాల్లో (ఈ నెల 27, 28న) రద్దు చేశామని రైల్వే అధికారులు ప్రకటించారు.
కిరండూల్ మార్గంలో...
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నెల 29 నుంచి నవంబరు 4 వరకు విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్‌లు (18515/18516) రద్దు చేశారు. మంగళవారం నుంచి 30 వరకు విశాఖ-కోరాపూట్ పాసింజర్ (58538), 28 నుంచి 31 వరకు కోరాపుట్-విశాఖ పాసింజర్ (58537)లు కూడా రద్దు చేశారు. 30, 31 తేదీల్లో విశాఖ-కోరాపుట్-విశాఖ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు (18512/18511) రద్దయ్యాయి. అలాగే ప్రస్తుతం గమ్యం కుదింపుతో విశాఖ-కోరాపుట్ మధ్య నడుస్తున్న విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజర్ రైళ్లను (58501/58502) మంగళవారం నుంచి 30 వరకు రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ముందుగానే రేషన్ సరుకుల పంపిణీ
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు ముందస్తుగా సరుకులు పంపిణీ చేస్తున్నట్టు జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి వి.భాస్కరరావు తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో నవంబరు నెలకు సంబంధించిన సరుకులను సోమవారం నుంచి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
కళాశాలలకు కూడా...
మద్దిలపాలెం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళ, బుధవారాలు అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్టు ఆర్‌ఐవో బి.మురళీధర్ ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర కళాశాలల యాజామాన్యాలు కలెక్టర్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. సెలవు రోజుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కళాశాలల యాజామాన్యాలు సెలవులు కచ్చితంగా అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐవో హెచ్చరించారు.
నేడు, రేపు పాఠశాలలకు సెలవు
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసినా, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పాఠశాలలు తెరిచినా సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఏయూ, అనుబంధ కళాశాలలకు సెలవులు
తుపాన్ నేపథ్యంలో ఏయూతోపాటు అనుబంధ కళాశాలల్లో తరగతులను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి నాలుగో తేదీ వరకు ఏయూ అనుబంధ కళాశాలల్లో ఆఫ్‌లైన్ తరగతులను రద్దు చేసినట్టు సీడీసీ డీన్ ప్రొఫెసర్ టీవీ కృష్ణ ప్రకటించారు. ఈ కాలంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఏయూ అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.