తాండవ చెంతనున్నా సాగునీటికి చింతే?
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:58 AM
చెంతనే ఉన్న తాండవ నదిలో పుష్కలంగా నీరు ఉన్నా పంట భూములకు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నేళ్లుగా సాగునీటి కాలువలో పూడిక తొలగించకపోవడంతో సుమారు 300 ఎకరాలకు నీరు అందని దుస్థితి నెలకొంది.
- కొన్నేళ్లుగా పూడుకుపోయిన మెరక కాలువ
- సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందని వైనం
- కూటమి ప్రభుత్వంలోనైనా కష్టాలు తీరతాయని రైతుల ఆశలు
- ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన
- ఖరీఫ్‌లో వరి సాగు చేయకుండా వదిలేయాల్సిన దుస్థితి
పాయకరావుపేట రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): చెంతనే ఉన్న తాండవ నదిలో పుష్కలంగా నీరు ఉన్నా పంట భూములకు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నేళ్లుగా సాగునీటి కాలువలో పూడిక తొలగించకపోవడంతో సుమారు 300 ఎకరాలకు నీరు అందని దుస్థితి నెలకొంది. దీంతో మండలంలోని ఈదటం, పాల్మన్‌పేట, కందిపూడి తదితర గ్రామాల రైతులు వరి పంట వేయకుండా పొలాలను వదిలేశారు. కాలువలో పూడిక తీయించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.
మండలంలోని తాండవ నది నుంచి ముఠా ఛానల్ కాలువ శ్రీరాంపురం వద్ద మెరక కాలువగా విడిపోయి ఈదటం, కందిపూడి, పాల్మన్‌పేట, కుమారపురం తదితర గ్రామాల్లోని సుమారు 1200 ఎకరాలకు సాగునీరందుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సాగునీటి కాలువలో పూడికను తొలగించలేదని, కందిపూడి వద్ద కాలువపై ఉన్న మదుము పూర్తిగా దెబ్బ తిని తలుపులు ఊడిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఏడాది సాగు నీరు ముందుకు సాగక, రైతులు వరి పంట వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయడంతో కాలువలో పూడిక తీయిస్తారని, పంటలు పండుతాయని రైతులు ఆశపడ్డారు. కానీ రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కాలువలో పూడిక తీయించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ రైతులు తిరిగారు. ఫలితం లేకపోవడంతో డెక్కన్ కంపెనీ సహకారం కోరారు. డెక్కన్ కంపెనీ యాజమాన్యం ఎక్స్‌కవేటర్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి చివరి నిమిషంలో ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు దున్ని, నారు మడులు సిద్ధం చేసి విత్తనాలను చల్లారు. తీరా నాట్లు వేసే సమయానికి కాలువలో నీరు ప్రవహించకపోవడంతో నాట్లు వేయకుండా వదిలేశారు. కొంతమంది రైతులు కాలువ ద్వారా సాగునీరు వస్తుందనే ఆశతో వర్షపు నీరుతో దమ్ములు పట్టారు. తీరా దమ్ములు పట్టిన తరువాత కాలువలో నీరు రాకపోవడంతో దమ్ములు ఎండిపోయాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని ఈదటం గ్రామానికి చెందిన రైతులు నేమాల సుబ్బారావు, సన్ని అప్పలరాజు, శోభన్‌బాబు, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. మెర క కాలువ ద్వారా ఈదటం రెవెన్యూ పరిధిలోని పాయకరాని చెరువులోకి నీరు చేరుతుంది. అయితే ఈ ఏడాది చుక్క నీరు కూడా చెరువులోకి చేరలేదు. దీంతో చెరువు కింద ఆయకట్టు భూములకు సాగునీరందని పరిస్థితి ఏర్పడిందని ఈదటం గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం కాలువలో నీరు తక్కువగా ప్రవహిస్తుండడంతో అపరాలు చల్లడానికి కొంతమంది దుక్కులు దున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సాగునీటి కాలువలో పూడికను తీయించి సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.