Share News

వానరాలతో వేగేదెట్టా?

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:49 AM

పట్టణంలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి నిత్యావసర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు జనంపై దాడులు చేస్తున్నాయి. శనివారం జలాలు వీధికి చెందిన కొండపల్లి రంగయ్యమ్మ అనే వృద్ధురాలిపై కోతుల మంద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో జనం భీతిల్లుతున్నారు.

వానరాలతో వేగేదెట్టా?
ఎలమంచిలి మిలట్రీ కాలనీ రోడ్డుపై కోతులు (ఫైల్‌ ఫొటో)

- ఎలమంచిలి వీధుల్లో యథేచ్ఛగా సంచారం

- ఇళ్లలోకి చొరబడి నిత్యావసరాలు ధ్వంసం

- తాజాగా కోతుల మంద దాడి చేయడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

- భీతిల్లుతున్న జనం

ఎలమంచిలి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో వానరాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి నిత్యావసర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు జనంపై దాడులు చేస్తున్నాయి. శనివారం జలాలు వీధికి చెందిన కొండపల్లి రంగయ్యమ్మ అనే వృద్ధురాలిపై కోతుల మంద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో జనం భీతిల్లుతున్నారు.

పట్టణంలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. సుమారు ఏడేళ్లుగా కోతుల సమస్యను పరిష్కరించాలని పట్టణ వాసులు కోరుతున్నా మునిసిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని మిలట్రీ కాలనీ, కొత్తపేట, రామ్‌నగర్‌, ఏఎస్‌ఆర్‌ కాలనీ, కోర్టుపేట, గాంధీనగర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ జంక్షన్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డు, త్రిమూర్తులు స్వామి ఆలయం జలాలు వీధి, ధర్మవరం, యర్రవరం, తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కోతులు సంచరిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ జనంపై దాడులు చేస్తున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా జంకుతున్నారు. సరుకులతో వెళుతున్న వారిపై మూకుమ్మడిగా దాడి చేసి సరుకులను పట్టుకుపోతున్నాయి. ఇప్పటి వరకు కోతుల చేతిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో మేడ పైనుంచి దిగుతున్న ఒక వ్యక్తిపై కోతులు దాడి చేయడంతో ఆయన పైనుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా శనివారం ఉదయం జలాలు వీధిలోని తన ఇంటి బయట పనులు చేస్తున్న కొండపల్లి రంగయ్యమ్మపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ సమయంలో కోతులను చెదరగొట్టడానికి ప్రయత్నించిన స్థానిక మహిళలపై కూడా దాడికి ప్రయత్నించాయి. తీవ్రంగా గాయపడిన రంగయ్యమ్మను ఆమె కుమారుడు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. ఈ సంఘటన వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. కోతుల వల్ల బయటకు రావడానికి కూడా భయపడాల్సి వస్తోందని, తలుపులు వేసుకోకపోతే ఇళ్లల్లోకి కూడా వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయని, దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణ వాసులు ఘాటుగానే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ బి.ప్రసాదరాజు వివరణ కోరగా కోతులను పట్టుకోవడానికి ఒక బృందాన్ని సంప్రతించామని, ఒక్కో కోతిని పట్టుకోవడానికి రూ.1,200 అడుగుతున్నారని, ఇది ఖర్చుతో కూడిన పని కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు.

Updated Date - Apr 05 , 2026 | 12:49 AM