యోగాంధ్ర వేడుకలు ఉన్నట్టా?.. లేనట్టా?
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:45 PM
అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 7 నుంచే యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని జిల్లా అధికారులు ప్రకటించినప్పటికీ, ఆ దిశగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు.
జిల్లాలో ఈ నెల 7 నుంచి మొదలవుతాయని ప్రకటించిన కలెక్టర్
ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించని వైనం
అందుకు గల కారణాలపై స్పష్టత కరువు
పాడేరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 7 నుంచే యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని జిల్లా అధికారులు ప్రకటించినప్పటికీ, ఆ దిశగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. వాస్తవానికి ఈ నెల 7న జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద, 8న హుకుంపేట మండలం మత్స్యగుండం వద్ద యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ టి.నిషాంతి ప్రకటించారు. కానీ 7, 8 తేదీల్లో ఆ రెండు పర్యాటక ప్రాంతాల్లో ఎటువంటి యోగ వేడుకలను నిర్వహించలేదు. పైగా ఆయా కార్యక్రమాలు ఎందుకు రద్దయ్యాయనే విషయాన్ని సైతం అధికారులు చెప్పడం లేదు. వాస్తవంగా ఈ నెల 7 నుంచి మొదలు కావాల్సిన యోగాంధ్ర వేడుకలు అనివార్యకారణాల వల్ల రద్దు చేశారా?, లేక వాయిదా వేశారా? అనేది సైతం అఽధికారులు కనీసం ప్రకటించలేదు. వారం క్రితం వరకు యోగాంధ్ర వేడుకలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ పలు మార్లు సమావేశాలు పెట్టి హడావిడి చేశారు. కానీ ఆఖరుకు వేడుకలు ఎందుకు ప్రారంభం కాలేదనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వివిధ శాఖల అధికారులు సైతం యోగాంధ్ర వేడుకలకు సంబంధించి ఏమవుతుందో అర్థం కావడం లేదని అంటున్నారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం
జిల్లాలో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే పలు కార్యక్రమాల పట్ల స్పష్టత లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా స్థాయి అధికారి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమే ఇందుకు కారణమనే వాదన బలంగా ఉంది. యోగాంధ్ర వేడుకలకు సంబంధించి అదే పరిస్థితి నెలకొందని తెలుస్తున్నది. ఎవరు ఏమి చేయాలనే దానిపై స్పష్టత లేకపోవడంతోపాటు అందర్ని సక్రమంగా సమన్వయం చేసే పరిస్థితులు కొరవడడంతో ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో యోగాంధ్ర వేడుకలపై స్పష్టత లేకుండాపోయింది.