ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమా?
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:55 AM
ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదు అవుతుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో ఖరీఫ్ పంటల సాగుపై అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి నెల రోజులు దాటినా.. పట్టిమని పది సెంటీమీటర్ల వర్షం పడలేదు.
ఎల్‌నినో ప్రభావంతో అంతంతమాత్రంగానే వర్షాలు
ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం
ఈ నెలాఖరు వరకు వేచి చూసే ధోరణి
అనుకున్న మేర వర్షాలు పడకపోతే స్వల్పకాలిక వంగడాల సాగు
అపరాలు, చిరుధాన్యాల పంటలను సూచిస్తున్న శాస్త్రవేత్తలు
అనకాపల్లి అగ్రికల్చర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదు అవుతుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో ఖరీఫ్ పంటల సాగుపై అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి నెల రోజులు దాటినా.. పట్టిమని పది సెంటీమీటర్ల వర్షం పడలేదు. ముమ్మరంగా దమ్ము పనులు జరగాల్సిన ప్రస్తుత తరుణంలో రైతులు కనీసం దుక్కులు కూడా దున్నలేదు. చెరువులు, ఇతర చిన్నతరహా సాగునీటి వనరుల కింద ఈ ఏడాది వరిసాగుపై ఎల్‌నినో నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితుల అంచనా నేపఽథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రూపొందించినప్పటికీ ఈ నెలాఖరు వరకు వేచి చూసి, పరిస్థితి ఆశాజనకంగా లేకపోతే అప్పుడు ప్రణాళికల అమలుపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు రెండో వారంలోగా భారీ వర్షాలు కురవకపోతే.. వరికి బదులుగా మినుము, పెసర, కంది వంటి అపరాల పంటలను వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ పంటలు విత్తిన తరువాత ఒకటి, రెండు భారీ వర్షాలు కురిస్తే మినుము, పెసర పంటలు దెబ్బతినే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. అపరాలే కాకుండా వేరుశనగ, సజ్జ, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాల పంటలను కూడా వేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
ఎల్‌నినోని దృష్టిలో ఉంచుకొని స్వల్ప, మధ్య కాలిక పంటలు సాగు చేయాలని, వాతావరణ మార్పులను తట్టుకునే పంటలను వేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తున్నది. నీటి ఎద్దడి ప్రభావం పంటలపై పడకుండా ఉండేందుకు లోతు దుక్కులు చేసుకోవాలని సేద్య శాస్త్రవేత్త డాక్టర్ కె.వి.రమణమూర్తి సూచిస్తున్నారు. 35 నుంచి 45 సెంటీమీటర్ల లోతున దుక్కి చేయడం వల్ల భూమి లోపల పొరల్లోకి గాలలి బాగా ప్రసరించి, తేమ నిల్వ శక్తి పెరుగుతుందని అని అన్నారు. పంట వేసిన తరువాత తగినంత వర్షం లేకపోతే పొటాషియం నైట్రేట్‌ను లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయడం వల్ల పంట కొంతమేర నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
మే నెలలో వేసిన నువ్వు పంట, త్వరలో కోతకు వస్తుందని, ఈ భూముల్లో సజ్జ, రాగి, కొర్ర, మొక్కజొన్న వేసుకోవచ్చని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సిహెచ్.ముకుందరావు తెలిపారు.
వర్షాభావ పరిస్థితులను చెరకు తోటలు చాలా వరకు తట్టుకోగలిగినప్పటికీ... కనీసస్థాయిలో కూడా వర్షాలు పడకపోతే పంట నాణ్యత దెబ్బతింటుందని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.అప్పలస్వామి చెప్పారు. జూలై 15 తర్వాత చెరకు నాటే రైతులు.. ఎకరాకు 20 వేల మూడు కళ్ల ముచ్చెలను నాటి, వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉంచాలని సూచించారు. గతంలో చెరకు సాగు చేసిన భూముల్లో వివిధ కారణాల వల్ల రైతులు మొక్కజొన్న వేస్తున్నారు. ఇందులో స్వల్పకాలిక రకాలను ఈ నెలాఖరు వరకు విత్తుకోవచ్చు ఎకరానికి ఎనిమిది నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనశుద్ధిచేసి, వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు బోదెలను ఏర్పాటు చేసుకొని మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా బోదెకు ఒకపైపున విత్తుకోవాలి. దీనివల్ల నీటిపారుదలకు సులభంగా ఉండడమే కాక వర్షం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. వర్షాధారంగా పండించే మొక్కజొన్నలో ఎకరానికి 70 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొఒటాష్ ఇచ్చే ఎరువులను, 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను వేయాలి.
4 శాతం విస్తీర్ణంలోనే పంటలు
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 69,026 హెక్టార్లలో సాగు చేయాలన్నది వ్యవసాయ శాఖ ప్రణాళిక. అయితే ఈ నెల 10వ తేదీ నాటికి 297 (4 శాతం) హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. వరి సాధారణ విస్తీర్ణం 56,329 హెక్టార్లు కాగా, 15 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. అది కూడా బోర్లు, బావులు వున్న పొలాల్లోనే నాట్లు వేశారు. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో వరి ఆకుమడులు పోస్తున్నారు. వర్షాభావం కారణంగా ఇప్పటికే వేసిన సజ్జ, మొక్కజొన్న, మినుములు, పెసర, వేరుశనగ, నువ్వు పంటలు మొక్కల్లో ఎదుగుదల అంతగా లేదు.