ఉక్కులో అడ్డగోలు సస్పెన్షన్లు
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:56 AM
స్టీల్ ప్లాంటులో అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నారు.
అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి ఉత్తర్వులు అందజేత
ఉత్పత్తి లక్ష్యాలు సాధించలేదనే అభియోగం
భయపెట్టి వీఆర్‌ఎస్‌తో బయటకు పంపాలని చూస్తున్నారని ఉద్యోగ వర్గాల ఆరోపణ
తగిన వనరులు లేకపోవడమే ఉత్పత్తి లక్ష్యాలు చేరుకోలేకపోవడానికి కారణమని వాదన
(విశాఖపట్న-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటులో అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా 1,700 మందికిపైగా ఉద్యోగులను వీఆర్‌ఎస్ కింద బయటకు పంపించారు. ఇప్పుడు మరోసారి వీఆర్‌ఎస్ అమలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టున్నారు. దీనికి మార్గం సుగమం చేసుకునేందుకు ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు.
ఉత్పత్తి లక్ష్యం సాధించలేదని, ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని ఆరోపిస్తూ పదకొండు మంది అధికారులను బుధవారం అర్ధరాత్రి వేళ సస్పెండ్ చేశారు. కొందరు అధికారుల ఇళ్లకు రాత్రి 12 గంటల సమయంలో వెళ్లి సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్టీల్ ప్లాంటు చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. కొన్ని నెలల తరబడి విధులకు హాజరుకాకుండా కనిపించకుండా పోయినవారు ఎవరైనా ఉంటే వారిళ్లకు వెళ్లి ఇలాంటి ఉత్తర్వులు ఇస్తారు. అది కూడా పగటి సమయంలోనే. కానీ ఇక్కడ అలా కాకుండా ఆ విభాగంలో నిర్దేశించిన ఉత్పత్తిని అందుకోలేకపోయారని పేర్కొంటూ సస్పెండ్ చేయడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఈ అవమానం భరించలేక చాలామంది అధికారులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. సహోద్యోగులకు కూడా జరిగిన అన్యాయం గురించి చెప్పుకోలేకపోతున్నారు. ఇలాంటి వాతావరణం కల్పించి, వీఆర్‌ఎస్ ద్వారా మరికొంత మందిని బయటకు పంపాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రోలింగ్ మిల్స్‌కు గ్యాస్ ఎక్కడ?
స్టీల్‌ప్లాంటులో కొన్ని విభాగాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి నడుస్తాయి. కోక్ ఓవెన్ విభాగంలో రోజుకు 250 పుషింగ్స్ వచ్చేవి. కోక్ ఓవెన్లు పాతవి కావడం, తరచూ మరమ్మతులకు గురికావడంతో ఇప్పుడు 150కి మించి రావడం లేదు. అదేవిధంగా ఒక బ్లాస్ట్ ఫర్నేస్‌కు సరిపడా ముడి పదార్థాలు మాత్రమే అందుబాటులో ఉండగా, రెండో బ్లాస్ట్ ఫర్నేస్ కోసం ప్రతి నెలా లక్ష టన్నుల కోక్‌ను బయట కొంటున్నారు. ఐరన్ ఓర్‌కు బదులు ఖరీదైన పెల్లెట్లు వాడుతున్నారు. ఇవన్నీ ప్లాంటుకు అదనపు భారం. కోక్ ఓవెన్ల నుంచి వచ్చే వృథా వాయువుల ద్వారా రోలింగ్ మిల్స్ నడుపుతారు. ఇక్కడ కోక్ ఓవెన్లు పూర్తిగా పనిచేయకపోవడం వల్ల గత ఆరు నెలలు రోలింగ్ మిల్స్ ఉత్పత్తి ఆగిపోయింది. వాటిని పునరుద్ధరించడానికి ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ గ్యాస్‌లను వినియోగిస్తున్నారు. వాటిలో తగిన కెలోరిఫిక్ విలువ లేకపోవడం, ఆ విభాగంలో అనుభవం కలిగినవారు పదవీ విరమణ చేయడం, వీఆర్‌ఎస్‌పై వెళ్లిపోవడం, కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, కొత్త వారిని పెట్టడం, వారికి అనుభవం లేక ఆశించిన ఉత్పత్తి రావడం లేదు. ఇదంతా అక్కడి అధికారుల తప్పిదంగా చూపించి సస్పెండ్ చేశారు.
ఇదిలావుంటే అనేక విభాగాలను ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. వాటిని ఆయా సంస్థలు అనుభవం లేనివారితో నడుపుతున్నాయి. దానికి కూడా ఆ విభాగాలను పర్యవేక్షించే అధికారులదే తప్పుగా పేర్కొంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో వీఆర్‌ఎస్ అమలు చేయడానికి ముందు కూడా ఇలాగే కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ ఆదేశాలపై నాటి సీఎండీ అనేక మందిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధానం అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని నైతిక మద్దతు ఇవ్వాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
విమర్శలు తట్టుకోలేక సస్పెన్షన్ల ఉపసంహరణ
సరైన కారణాలు చూపకుండా, అర్ధరాత్రి వేళ సస్పెన్షన్లు చేయడంపై పెద్దఎత్తున చర్చ జరగడం, దీనిపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లడం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీయడంతో స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఉలిక్కిపడింది. జాతీయ స్థాయిలో సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చిందని గ్రహి ంచి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సస్పెండ్ చేసిన ఉద్యోగులను శనివారం నుంచి విధుల్లోకి రావాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే వారిపై ఛార్జిషీట్లు ఎలా వేస్తారనే దానిపై చర్చ మాత్రం నడుస్తోంది.