Share News

అడ్డగోలుగా మాస్టర్‌ప్లాన్‌

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:35 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ప్లాన్‌-2041 తయారీలో నచ్చిన వారికి ఒకలా...నచ్చని వారికి మరోలా అన్నట్టు ప్లానింగ్‌ విభాగం అధికారులు వ్యవహరించారు.

అడ్డగోలుగా మాస్టర్‌ప్లాన్‌

ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు

ఒక దగ్గర 100 అడుగులు..

అదేమార్గంలో ఇంకో చోట 60 అడుగులు

మరో మార్గంలో ఒకచోట..

చివరికి వెళ్లేసరికి 40 అడుగులు

డ్రాఫ్ట్‌ ప్లాన్‌లో ఒకలా...

ఖరారు చేసిన ప్లాన్‌లో ఇంకోలా

నేరెళ్లవలసలోనూ కొందరికి లబ్ధి కలిగేలా మార్పులు

వీఎంఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగం కుప్పిగంతులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ప్లాన్‌-2041 తయారీలో నచ్చిన వారికి ఒకలా...నచ్చని వారికి మరోలా అన్నట్టు ప్లానింగ్‌ విభాగం అధికారులు వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ మాస్టర్‌ ప్లాన్‌ తయారు కాగా అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసే ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించి, మళ్లీ మార్పులు చేసింది. అయితే...అందులోను వీఎంఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగం చేతివాటం ప్రదర్శించింది. డ్రాఫ్ట్‌ ప్లాన్‌ తయారు చేసినప్పుడు అప్పటి కమిషనర్‌ విశ్వనాథన్‌ ఎక్కడా డీవియేషన్లు లేకుండా, ఒక క్రమ పద్ధతి ప్రకారం రూపొందించారు. అదే ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తరువాత అభ్యంతరాల పేరుతో ప్లానింగ్‌ విభాగం చేతులు తడిపిన వారికి అనుకూలంగా ఫైనల్‌ ప్లాన్‌ మార్చేసింది. ఒక మార్గం..ఒక చోట ఒక వెడల్పు, మరోచోట ఇంకో వెడల్పుతో ఖరారు చేశారు.

దసపల్లా భూముల రహదారిలోనే...

వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములను వైసీపీ ప్రభుత్వం 22-ఏ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అక్కడ భారీ భవనాల నిర్మాణాలకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రహదారిని 100 అడుగలకు పెంచారు. సర్క్యూట్‌ హౌస్‌ నుంచి అవతల గ్యాస్‌ గోడౌన్‌ దాటి పందిమెట్ట రోడ్డు వరకు 40 అడుగుల రహదారి ఉండేది. దానిని వైసీపీ హయాంలో 100 అడుగులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దానిని 80 అడుగులకు కుదించారు. ఇప్పుడు మళ్లీ దానిని 100 అడుగులు చేయడం విమర్శలకు దారితీసింది. అయితే రహదారి మొత్తం అలా లేదు. ఆ మార్గంలో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద మళ్లీ 40 అడుగులు ఉంచారు. ఆ పక్కనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు నివాసం ఉంటున్నారు. ఆయన అక్కడ రహదారి విస్తరణపై కోర్టుకు వెళ్లారు. దాంతో ఆ ముక్క వరకు 40 అడుగులు ఉంచేసి, మిగిలిన రహదారి 100 అడుగులు చేశారు. దీనివల్ల దసపల్లా భూములు పొందిన కంపెనీ భారీ భవంతుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ సానుభూతిపరులకు మేలు జరిగే నిర్ణయం జరిగింది.

నోవాటెల్‌ డౌన్‌లోను మతలబే

పందిమెట్ట ఏపీఎస్‌ఈబీ కార్యాలయం నుంచి గ్రాండ్‌ బే, నోవాటెల్‌ డౌన్‌ బీచ్‌ రోడ్డు వరకు 100 అడుగుల రహదారి ప్రతిపాదించారు. దానిని కూడా ఖరారు చేసిన ప్లాన్‌లో మార్చేశారు. ఈ 100 అడుగుల రహదారి ఉంటేనే భారీ బహుళ అంతస్థుల నిర్మాణానికి అనుమతులు వస్తాయి. లేదంటే రావు. మరి ఎవరి లబ్ధి కోసం పనిచేశారో తెలియదు గానీ ఆ మార్గంలో అంకోశాకు వెళ్లే జంక్షన్‌ నుంచి నోవాటెల్‌ డౌన్‌ వరకు 60 అడుగులకు కుదించేశారు. ఆ మార్గాన్ని 100 అడుగులు చేస్తే అక్కడున్న ఓ భారీ భవనానికి ఇబ్బందులు వస్తాయని, కొన్ని నిర్మాణాలు తొలగించాల్సి వస్తుందని, అందుకే కుదించేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ భారీ భవనంలో చుట్టూ ఏడు మీటర్ల సెట్‌ బ్యాక్‌ ఉండాలి. అందులో అగ్నిమాపక వాహనం తిరగడానికి ఏర్పాట్లు ఉండాలి. కానీ ఎక్కడికక్కడ రిటైనింగ్‌ గోడలు నిర్మించేశారు. కొన్నిచోట్ల ర్యాంపులు కూడా వేసుకున్నారు. ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్‌లో ఆ మార్గం 100 అడుగులుగా ఉంటే వాటిని కూలగొట్టాల్సి వస్తుంది. అందుకని వారికి లబ్ధి చేకూర్చడానికి వీఎంఆర్‌డీఏ ప్లానింగ్‌ అధికారులు కాసులకు కక్కుర్తి పడి 60 అడుగులు చేశారని విమర్శలు వస్తున్నాయి.

నేరెళ్లవలసలోను అంతే...

ప్లానింగ్‌ విభాగం అధికారులు నేరెళ్లవలసలో మాస్టర్‌ప్లాన్‌ రహదారులను డ్రాఫ్ట్‌ ప్లాన్‌లో ఒకలా, ఖరారుచేసిన ప్లాన్‌లో మరోవిధంగా చూపించారు. డ్రాఫ్ట్‌ ప్లాన్‌ ప్రకారం ఆ మార్గం మలుపులు తిరుగుతూ వెళ్లగా, ఖరారు చేసిన ప్లాన్‌లో నేరుగా చూపించారు. ఈ మార్పుతో కొందరికి లబ్ధి కలిగేలా చేశారు. ఈ కారణంగా ఒక హౌసింగ్‌ సొసైటీ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పారదర్శకంగా మాస్టర్‌ప్లాన్‌ చేశామని ప్రకటించినా లొసుగులు మాత్రం తప్పలేదు.

Updated Date - Aug 04 , 2026 | 01:35 AM