Share News

యథేచ్ఛగా భూ కబ్జాలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:12 AM

జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా యథేచ్ఛగా కొనసాగుతున్నది. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నేతలతోపాటు వారి అండదండలతో పలువురు బడాబాబులు ప్రభుత్వ భూములను ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, రికార్డుల్లో పేర్లు నమోదు చేయించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొంతమంది నాయకులు, వైసీపీ నేతలతో జట్టుకట్టారు. రెండు ప్రధాన పార్టీల నేతలు కలిసి, ప్రభుత్వ భూములను తమ సొంతం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారులు సైతం వారితో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యథేచ్ఛగా భూ కబ్జాలు
అనకాపల్లి మండలం పిసినికాడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నాటిన కొబ్బరి మొక్కలు

వైసీపీ హయాంలో రికార్డులను మార్చేసిన నేతలు

అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు

నాటి ఓ మంత్రి ఆదేశాలతో విచారణ నివేదికను బుట్టదాఖలు చేసిన అధికారులు

కూటమి అధికారంలో వచ్చిన తరువాత కబ్జా యత్నాలు కొనసాగింపు

భూముల్లో హెచ్చరిక బోర్డులు తొలగింపు

రాత్రిపూట యంత్రాలతో చదును పనులు

సహకారం అందిస్తున్న ఓ పార్టీ నేతలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జా యథేచ్ఛగా కొనసాగుతున్నది. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నేతలతోపాటు వారి అండదండలతో పలువురు బడాబాబులు ప్రభుత్వ భూములను ఆక్రమించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, రికార్డుల్లో పేర్లు నమోదు చేయించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొంతమంది నాయకులు, వైసీపీ నేతలతో జట్టుకట్టారు. రెండు ప్రధాన పార్టీల నేతలు కలిసి, ప్రభుత్వ భూములను తమ సొంతం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అధికారులు సైతం వారితో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రభుత్వ భూములు ఎక్కడున్నా వాలిపోయారు. రూ.కోట్లు విలువైన భూముల్లో పాగా వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత భూములకు రక్షణ కల్పిస్తారని అంతా భావించారు. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే అప్పట్లో వైసీపీ నేతలు మాత్రమే భూ కబ్జాలకు పాల్పడగా, ఇప్పుడు కూటమిలో ఒక పార్టీకి చెందని నేతలు, వైసీపీ నాయకులతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను చెరబడుతున్నారు. వైసీపీ హయాంలో 2023లో సమగ్ర భూసర్వే నిర్వహించినప్పుడు పిసినికాడ పరిధిలోని సర్వే నంబర్లు 363 నుంచి 371 వరకు సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమి గయాలుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై వుంది. కొంతమంది వైసీపీ నాయకులు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నకిలీ పత్రాలు సృష్టించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయించి, సమగ్ర భూసర్వే తరువాత సాగుదారులుగా కొంతమంది రైతుల పేర్లను నమోదు చేయించారు. తరువాత ఆక్రమిత భూమిని చదును చేయించిన వైసీపీ నాయకుడొకరు కొబ్బరి మొక్కలు కూడా నాటించారు. పిసినికాడలో భూదోపిడీపై 2023లో టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు.. అప్పుడు జిల్లాకు చెందిన ఒక మంత్రి సిఫారసుతో విచారణ నివేదికను బుట్టదాఖలు చేశారు.

ఇదిలా ఉండగా 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పిసినికాడలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. 2025 అక్టోబరులో ఆర్డీఓ నేతృత్వంలో సర్వే శాఖ ఏడీ, తహశీల్దారు విచారణ జరిపారు. భూములను రీసర్వే చేసి పిసినికాడ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 363 నుంచి 371 వరక 40 ఎకరాలు ప్రభుత్వ గయాలుగా నిర్ధారించారు. ఇవి ప్రభుత్వ భూములంటూ హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా కోటి రూపాయలు పలుకుతున్నది. దీని ప్రకారం కబ్జాకు గురైన భూమి విలువ రూ.40 కోట్లు వుంటుందని అంచనా. కాగా ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు కొద్ది రోజుల క్రితం మాయం అయ్యాయి. ఆ భూముల్లో పాగా వేసేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పల్లో భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలతో, ఇప్పుడు కూటమిలో ఒక పార్టీకి చెందిన నేతలు జతకట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరంతా రహస్యంగా సమావేశమై, ప్రభుత్వ భూములను ఎలాగైనా సొంత చేసుకోవాలని ప్రణాళికను రూపొందించినట్టు సమాచారం. ఈ భూమిని గతంలో కొంతమంది పేద రైతులకు ప్రభుత్వం ఇచ్చిందని, అందువల్ల వారికే ఈ భూములు దఖలు పడ్డాయని చెబుతూ రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

సత్యనారాయణపురంలో...

అనకాపల్లి మండలం తుమ్మపాల రెవెన్యూ పరిధిలోని సత్యనారాయణపురంలో సర్వే నంబరు 360 నుంచి 385 వరకు ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ గయాలు భూములపై స్థానిక నేత ఒకరు కన్నేశారు. టిడ్కో హౌసింగ్‌ కాలనీకి సమీపంలో ఉన్న ఈ భూములను వారం రోజుల నుంచి రాత్రిపూట ఎక్స్‌కవేటర్లతో చదును చేయిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో గయాలు, కొండపోరంబోకు భూములు అని స్పష్టంగా నమోదైవున్నప్పటికీ కూటమి నేతల అండదండలతో భూమిని సొంతం చేసుకొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అంతేకాక ప్రభుత్వ భూమిలో ఏకంగా బోరు కూడా వేయించారు. దీనికి విద్యుత్‌ కనెక్షన్‌ కూడా వుంది. ప్రభుత్వ భూమిలో వేసిన బోరుకు ఈపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. వారం రోజుల నుంచి ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తయినా చూడడంలేదు. దీనిపై అనకాపల్లి తహశీల్దారు జి.ఆనంద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా.. తాను ఇటీవలే ఇక్కడ బాధ్యతలు చేపట్టానని, పిసినికాడ, సత్యనారాయణపురంలో ఆక్రమణకు గురైనట్టు చెబుతున్న ప్రభుత్వ భూములను పరిశీలించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు.

Updated Date - Apr 25 , 2026 | 01:12 AM