నర్సింగ్ విద్యాసంస్థల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:52 AM
జిల్లాలో నర్సింగ్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఇరుకు గదుల్లో తరగతుల నిర్వహణ
రకరకాల ఫీజుల పేర్లతో విద్యార్థులపై అదనపు భారం
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు
మౌలిక వసతులు లేకపోయినా అనుమతులు, రెన్యువల్!
విశాఖపట్నం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో నర్సింగ్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోయినా ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేసుకుంటూ ఏటా రెన్యువల్ చేయించుకుంటున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు 40 వరకు నర్సింగ్ కాలేజీలు, 30 వరకు నర్సింగ్స్ స్కూల్స్ ఉన్నాయి. అనేక సంస్థల్లో నిర్ణీత మొత్తం కంటే విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నా ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇవి తప్పనిసరి..
నర్సింగ్ స్కూల్స్, కాలేజీలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేస్తుండాలి. కానీ, ఎక్కడా ఆ దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సును 40 సీట్లతో నిర్వహించే కాలేజీలు తప్పనిసరిగా ఆరుగురు టీచింగ్ సిబ్బందిని నియమించుకోవాలి. అలాగే, సదరు కాలేజీకి పేరెంట్ హాస్పిటల్ ఉండాలి. ఒకవేళ పేరెంట్ హాస్పిటల్ లేకపోతే ఏదైనా హాస్పిటల్‌తో 30 ఏళ్లపాటు ఒప్పందం చేసుకోవాలి. సొంత భవనం గానీ, 30 ఏళ్లపాటు ఒప్పందం చేసుకున్న బిల్డింగ్ ఉండాలి. ఇక, 30 సీట్లతో జీఎన్‌ఎం కోర్సు నిర్వహించాలంటే నర్సింగ్ స్కూల్స్ యాజమాన్యాలు తొమ్మిది మంది టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకోవాలి. ప్రత్యేక అకడమిక్ భవనం, ల్యాబ్స్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, విద్యార్థులకు హాస్టల్ సదుపాయం ఉండాలి. విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్ నిర్వహించే సదుపాయం కూడా ఉండాలి. ఐఎన్‌సీ అర్హతలు కలిగిన ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీ, ట్యూటర్లు ఉండాలి. నర్సింగ్ పుస్తకాలు, డిజిటల్ వనరులు, జర్నల్స్ ఉండాలి. కానీ, కొన్ని కాలేజీలు నిబంధనల మేరకు భవనాలను కూడా కలిగి ఉండడం లేదు. చిన్న గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. దాదాపు సగానికిపైగా కాలేజీల్లో నిర్దేశిత స్థాయిలో సిబ్బంది కూడా ఉండరు. ఇక, విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. క్లినికల్ ట్రైనింగ్ పేరుతో కేజీహెచ్, ఇతర ఆస్పత్రులకు విద్యార్థులను తీసుకువెళుతుంటారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. పరీక్షలు సమయంలో కూడా డబ్బులు వసూలు చేస్తుంటాయి. కొన్ని విద్యా సంస్థలైతే విద్యార్థులు కోర్సు పూర్తిచేసి బయటకు వెళ్లే సమయంలో కూడా ఎంతోకొంత రాబట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నాయి. విద్యా సంస్థలపై పర్యవేక్షణ లేకపోవడంతో యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.