Share News

సమగ్ర శిక్షలో ఇష్టారాజ్యం!

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:37 AM

జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు కార్యాలయంలో ఒక ఉద్యోగి అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్ల కదలికల నుంచి సిబ్బంది విధుల కేటాయింపులు, కార్యాలయ పరికరాల కొనుగోళ్ల వరకు పలు కీలక అంశాల్లో ఆయన పెత్తనం శృతిమించిపోతోందని సహచర ఉద్యోగులే చెబుతున్నారు.

సమగ్ర శిక్షలో ఇష్టారాజ్యం!
అనకాపల్లిలోని సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు కార్యాలయం

ఫోటో: 13ఏకేపీ.4.

- అన్ని వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్న ఉద్యోగి

- అడ్డదారిలో నియామకాలు

- వస్తువుల కొనుగోళ్లలో చేతివాటం

- చేయి తడిపితేనే ఫైళ్లు కదిలేది

- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వేధింపులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు కార్యాలయంలో ఒక ఉద్యోగి అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్ల కదలికల నుంచి సిబ్బంది విధుల కేటాయింపులు, కార్యాలయ పరికరాల కొనుగోళ్ల వరకు పలు కీలక అంశాల్లో ఆయన పెత్తనం శృతిమించిపోతోందని సహచర ఉద్యోగులే చెబుతున్నారు.

అనకాపల్లిలోని సమగ్ర శిక్షా ప్రాజెక్టు కార్యాలయ పరిపాలనా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఒక ఉద్యోగి పరిధికి మించి వ్యవహరిస్తుండడంపై ఇటీవల సహచర ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనపైనే ఫిర్యాదు చేస్తారా? అని ఆ ఉద్యోగి దిగువ స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారని తెలిసింది. ఆయన సమయానికి కార్యాలయానికి రారని, వచ్చిన తరువాత కూడా ముఖ హాజరు వేయరని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. గత ఆరు నెలలుగా ఎడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌(ఏపీసీ) లేకపోవడంతో అన్నీ తానై వ్యవహరిస్తూ అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్టు సమాచారం. గత మార్చి నెలలో ఇన్‌చార్జి ఏపీసీ అనుమతి లేకుండానే కార్యాలయానికి కావాల్సిన రెండు ఏసీలు, ఒక సోఫాసెట్‌ను అధిక ధరకు కొనుగోలు చేశారు. సుమారు రూ.1.2 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆ రెండు ఏసీలు, సోఫా ప్రస్తుతం కార్యాలయంలో కనిపించడం లేదు. అంతే కాకుండా కార్యాలయంలో పొరుగు సేవల పేరుతో కారు డ్రైవర్‌నే వాచ్‌మన్‌గా రికార్డుల్లో చూపించి జీతం చెల్లిస్తున్నట్టు బిల్లులు పెడుతున్నారని తెలిసింది. విశాఖలోని ఒక బ్యాంకులో అవినీతి ఆరోపణలతో తొలగించిన వ్యక్తిని తాత్కాలిక భృతిపై అకౌంట్స్‌ విభాగంలో నియమించడం చర్చనీయాంశమైంది. పుస్తకాలు, స్టేషనరీ, ఇతరత్రా వస్తువుల సరఫరాకు కె.కోటపాడుకు చెందిన నాయుడు అనే ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని ప్రతి సరఫరా ఆర్డర్‌ను చేజిక్కించుకుంటున్నారనే విమర్శలున్నాయి. నాయుడిని కాదని ఇతరులకు టెండర్లు దక్కాయంటే బిల్లుల చెల్లింపు విషయంలో రకరకాల కొర్రీలు పెడుతూ వెండర్లను ఇబ్బందులకు గురిచేస్తారని సిబ్బంది చెబుతున్నారు. కార్యాలయాన్ని కనీసం లిఫ్టు కూడా లేని వ్యాపార సముదాయ భవనం మూడో అంతస్థులో ఏర్పాటు చేసి మార్కెట్‌ రేటు కంటే అధిక అద్దె చెల్లిస్తున్నారని తెలిసింది.

ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే..

విద్యాశాఖలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రతి చెల్లింపుల విషయంలో సదరు ఉద్యోగి వద్దకు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు వెళుతుంటారు. మండలాల్లోని పాఠశాలల్లో జరిగే స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌, ఇతరత్రా సందర్భాల్లో ఖర్చుల బిల్లులు సదరు అధికారి వద్దకు వెళతాయి. అంతే కాకుండా తనతో పనిచేసే ఉద్యోగుల వేతనాలు, సరండర్‌ సెలవులు, ఇంక్రిమెంట్‌లు, జీపీఎఫ్‌ రుణం, అప్పులకు సంబంధించిన పనులు, మిగతా అన్ని రకాల సేవల కోసం సమగ్ర శిక్ష పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఆయన వద్దకు వెళ్లాల్సిందే. ఆయన నుంచి ఫైలు కదలాలంటే విశాఖపట్నంలోని ఇంటికి వెళ్లి కలిసి ఎంతో కొంత ముట్టజెబితేనే ఆ ఫైలుకు మోక్షం లభిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కలవని వారి ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతాయని చెబుతున్నారు. మొన్నటి వేసవి సెలవులకు ముందు అచ్యుతాపురంలో ఒక కేజీబీవీలో విద్యార్థి పాముకాటుకు గురైతే, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన ఫైలు ఆ ఉద్యోగి టేబుల్‌పై నెలల తరబడి ఉంచేశారు. ఈ సంఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా కేజీబీవీ ఉద్యోగుల్లో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకుండా ఆయన అడ్డుకుంటున్నారని తెలిసింది. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు అందాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులను సైతం ఆయన ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌ ఆ ఉద్యోగి వ్యవహారాలపై దృష్టి సారిస్తే మరిన్ని అవకతవకలు వెలుగులోకి వస్తాయని కార్యాలయ సిబ్బంది అంటున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:37 AM