Share News

ఐఐపీఈలో ఇష్టారాజ్యం

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:30 AM

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఉన్నతాధికారుల తీరు మారడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కొందరిని ఉద్యోగుల్లోకి తీసుకుని, ఎప్పటి నుంచో పనిచేస్తున్న స్థానికులను ఇప్పటికే తొలగించిన విషయం తెలిసిందే.

ఐఐపీఈలో ఇష్టారాజ్యం

మారని అధికారుల తీరు

అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకునేందుకు అడుగులు

గడిచిన ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఆదరాబాదరాగా ముందుకు

డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారి

పదవీ విరమణ...అయినా కొనసాగింపు

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) ఉన్నతాధికారుల తీరు మారడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా కొందరిని ఉద్యోగుల్లోకి తీసుకుని, ఎప్పటి నుంచో పనిచేస్తున్న స్థానికులను ఇప్పటికే తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా, మరోమారు అడ్డగోలు నియామకాలకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది.

గత ఏడాది వివిధ క్యాడర్లకు సంబంధించి 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడాది దాటినా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లలేదు. అయితే, తాజాగా వర్సిటీ ఉన్నతాధికారులు తమకు కావాల్సిన వ్యక్తులను ఆ పోస్టుల్లో నియమించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం వర్సిటీలో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న ఒక అధికారిని మూడేళ్ల క్రితం ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌ నుంచి డిప్యూటేషన్‌ (లీన్‌)పై తీసుకువచ్చారు. ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తయింది. దీంతో ఆయన తిరిగి మాతృ సంస్థకు వెళ్లాల్సి ఉంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌ను కొనసాగించారు. ఆయన మాతృ సంస్థలో గత నెలాఖరున పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ చేసిన వ్యక్తికి ఇక్కడ కీలక బాధ్యతలను అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని కొందరు ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అలాగే, హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల పట్ల అధికారులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరుపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని సదరు విద్యార్థినులు బెదిరిస్తున్నారు. ఆ సమాచారం బయటకు ఎలా వెళ్లిందో చెప్పాలని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది.

రూ.50 లక్షలతో ఫర్నీచర్‌ కొనుగోలుకు యత్నం

వర్సిటీకి చెందిన మరో కీలక అధికారి కోసం వంగలిలోని క్యాంపస్‌లో ఆరు గదులతో ఇంటిని నిర్మించారు. అందులో సుమారు రూ.50 లక్షలతో ఫర్నీచర్‌ కొనుగోలు చేయడానికి సిద్ధం కావడంతో కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. భారీగా నిధులు వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పడంతో వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.30 లక్షలతో ఫర్నీచర్‌ కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల కిందట వర్సిటీలో చేరిన కొందరు ఉద్యోగులు ఉన్నత స్థాయి వ్యక్తులకు భారీగా ముడుపులు సమర్పించినట్టు తెలుస్తోంది. దీనిపైనా కొందరు ఫిర్యాదులు చేసినట్టు చెబుతున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 01:30 AM