అరకులోయ ఆయుర్వేద ఆస్పత్రికి హంగులు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:58 PM
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో అరకులోయ ప్రభుత్వ ఆయుర్వేద వైౖద్యశాలను ఆధునీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అధునాతన హంగులను ఏర్పాటు చేస్తున్నారు.
రూ.30 లక్షలతో మరమ్మతులు
ఆస్పత్రిలో అన్ని సౌకర్యాల కల్పన
మరో పది రోజుల్లో పనులన్నీ పూర్తి
అరకులోయ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో అరకులోయ ప్రభుత్వ ఆయుర్వేద వైౖద్యశాలను ఆధునీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అధునాతన హంగులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఆయూష్ మిషన్ రూ.30 లక్షలను మంజూరు చేసింది. అరకులోయ ఆయుర్వేద ఆస్పత్రిలో గత మూడు నెలలుగా పాత భవనంలో అవసరమైన మరమ్మతులన్నీ చేపట్టారు. ఆసుపత్రి చుట్టూ కాంపౌండ్ వాల్, ఐరన్ గేటు, ఆవరణలో ఇంటర్నల్ రోడ్లు వేశారు. అలాగే పాత భవనం గోడలకు ప్లాస్టింగ్ చేసి పుట్టి పెట్టారు. ఫ్లోరింగ్ మార్పు చేసి టైల్స్ ఏర్పాటు చేశారు. భవనం ముందు ప్రత్యేకంగా ఐరన్ రేకులతో షెడ్‌ను ఏర్పాటు చేశారు. రోగులు షెడ్డులో వేచి ఉండేందుకు సౌకర్యాలు కల్పించారు. ఆసుపత్రికి అవసరమైన భవన పునర్నిర్మాణ పనులు చకచకా చేపడుతున్నారు. ఈ భవన నిర్మాణ పనులను ఏపీ మెడికల్ సైన్స్‌స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) డీఈఈ వర్మ పర్యవేక్షిస్తున్నారు. మరో పది రోజుల్లో అరకులోయలో పనులు పూర్తి కానున్నాయని వర్మ తెలిపారు. ఐటీడీఏ పరిధిలో మరో నాలుగు ప్రాంతాల్లో ఆయుర్వే ఆస్పత్రిలకు భవనాలు మంజూరు చేశారు. ఆ భవనాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని డీఈఈ వర్మ తెలిపారు.