Share News

పర్యాటకులకు మధురానుభూతి పంచేలా అరకు ఉత్సవ్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:30 AM

పర్యాటకులకు మధురానుభూతి పంచేలా అరకు ఉత్సవ్‌ను నిర్వహించనున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

పర్యాటకులకు మధురానుభూతి పంచేలా  అరకు ఉత్సవ్‌
అరకు ఉత్సవ్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌బర్ధార్‌, పాడేరు డీఎస్పీ అభిషేక్‌

29న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్‌ షో

31న ప్రముఖ గాయని సునీత లైవ్‌ కాన్సర్ట్‌

1న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్‌ లైవ్‌ షో

అరకులోయ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పర్యాటకులకు మధురానుభూతి పంచేలా అరకు ఉత్సవ్‌ను నిర్వహించనున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఉత్సవ్‌ ప్రధాన వేదిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎస్పీ అమిత్‌బర్ధార్‌, పాడేరు డీఎస్పీ అభిషేక్‌తో కలిసి ఆయన ఉత్సవ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అరకు ఉత్సవ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. పర్యటనలో భాగంగా చొంపి గ్రామాన్ని సందర్శించి, అక్కడ హోం స్టేలను పరిశీలిస్తారని చెప్పారు. గిరిజనుల ఇళ్లలో పర్యాటకుల బస, వారి ఆతిథ్యంపై ముఖ్యమంత్రి స్వయంగా గిరిజనులతో చర్చిస్తారన్నారు. పర్యాటకులకు థ్రిల్లింగ్‌ కలిగేలా మాడగడ ప్రాంతంలో పారా గ్లైడింగ్‌, పారా మోటారింగ్‌తో పాటు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ (చాపర్‌) రైడ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వైజాగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా స్కూబా డైవింగ్‌ వంటి సాహస క్రీడలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. గాలి కొండ, సుంకరమెట్ట ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ ఉంటుందన్నారు. జనవరి 31న 5కె రన్‌ (అరకు మారథాన్‌)ను అరకు డిగ్రీ కళాశాల నుంచి అంజోడ పైనరీ వరకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల గిరిజన తెగల సంప్రదాయ నృత్యాలు, కళలతో భారీ కార్నివాల్‌ నిర్వహించనున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారుల స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పద్మాపురం గార్డెన్స్‌లో ఫ్లవర్‌ షో, సరికొత్త ‘అరకు బొకే’ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన చెప్పారు. తిరుపతి ఇండియన్‌ క్యులినరీ ఇనిస్టిట్యూట్‌ సహకారంతో విశిష్ట గిరిజన వంటకాలను పర్యాటకులకు వడ్డించనున్నామని చెప్పారు. ఈ నెల 30న సాయంత్రం ప్రధాన వేదికపై హైదరాబాద్‌కు చెందిన షహరీ బ్యాండ్‌ ఉంటుందన్నారు. 31న సాయంత్రం ప్రముఖ గాయని సునీత లైవ్‌ కాన్సర్ట్‌ ఉంటుందని, ముగింపు రోజైన ఫిబ్రవరి 1న సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్‌ లైవ్‌ షోతో పాటు ఆకాశంలో అద్భుతమైన డ్రోన్‌ షో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, శ్రేయాస్‌ మీడియా ఈవెంట్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. పర్యాటకులు మారథాన్‌, సైక్లింగ్‌ పోటీలకు ఆన్‌లైన్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jan 28 , 2026 | 12:30 AM