30 నుంచి అరకు ఉత్సవ్
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:32 PM
అరకు ఉత్సవ్‌ను ఈ నెల 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అరకు ఉత్సవ్‌పై ముందస్తు సమీక్షను గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ నిర్వహించారు.
- మూడు రోజులపాటు నిర్వహణ
- ప్రధాన వేదికలు డిగ్రీ కళాశాల మైదానం, మాడగడ వ్యూ పాయింట్, పద్మాపురం గార్డెన్, అంజోడ పినేరి
- విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, జనవరి 22(ఆంధ్రజ్యోతి): అరకు ఉత్సవ్‌ను ఈ నెల 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అరకు ఉత్సవ్‌పై ముందస్తు సమీక్షను గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ నిర్వహించారు. ఈ నెల 30న ఉత్సవ్‌ను ప్రారంభించి, తొలి రోజు సాహస క్రీడలు, ట్రెక్కింగ్, ఆధునిక సాంస్కృతిక ప్రదర్శనలు, రెండో రోజైన 31న యూత్ స్పోర్ట్స్, గిరిజనుల జీవన శైలిపై యువతకు పోటీలు, స్థానిక వంటకాలు, ప్రభుత్వ స్టాళ్ల ఏర్పాటు, ఆఖరి రోజు ఫిబ్రవరి 1న స్థానిక గిరిజన కళాకారులతో సంప్రదాయ ప్రదర్శనలు, మూడు రోజుల ఉత్సవ్‌లో ప్రతిభకనబరచిన వారికి బహుమతుల ప్రదానం, ముగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే మూడు రోజుల పాటు ఆయా అంశాల్లోని కార్యక్రమాలను నిర్వహించేందుకు నాలుగు ప్రధాన వేదికలను గుర్తించారు. అరకులోయలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, పద్మాపురం ఉద్యానవనం, మాడగడ వ్యూపాయింట్, అంజోడ పినేరి వద్ద మూడు రోజులు అనేక రకాల సాహస క్రీడలు, క్రీడా పోటీలు, పూల ప్రదర్శనలు, పలు సాంస్కృతిక ప్రదర్శనల పోటీలు, వంటకాలు, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.
అరకు ఉత్సవ్‌ను విజయవంతం చేయాలి
ఈ నెల 30 నుంచి మూడు రోజులు నిర్వహించే అరకు ఉత్సవ్‌ను అధికారులు విజయవంతం చేయాలని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఉత్సవ్ నిర్వహణపై కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించి ఎవరెవరు ఏం చేయాలనేది ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు. నాలుగు ప్రధాన వేదికల్లో ఏర్పాట్లు చేయాలని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలతో పాటు రవాణా సదుపాయాలను మెరుగ్గా అందించాలన్నారు. ఉత్సవ్‌లో గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు ప్రతిబింబించేలా చక్కని ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.