Share News

29 నుంచి అరకు ఉత్సవ్‌

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:45 PM

గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించనున్న అరకు ఉత్సవ్‌ ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనుంది.

29 నుంచి అరకు ఉత్సవ్‌
అరకు ఉత్సవ్‌లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌బర్ధార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, తదితరులు

ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ, ఐటీడీఏ పీవో

ముఖ్యమంత్రి పర్యటించే తుర్రాయిగుడ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌

అరకులోయ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించనున్న అరకు ఉత్సవ్‌ ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనుంది. ఈ ఉత్సవాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదివారం పరిశీలించారు. ఎస్పీ అమిత్‌ బర్ధార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి ఆయన ఉత్సవ్‌ ప్రధాన వేదిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఉత్సవ నిర్వాహకులైన శ్రేయాస్‌ మీడియా ప్రతినిధులకు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఉత్సవ్‌ ప్రారంభం రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, కారవాన్‌ వాహనాల ప్రదర్శనతో పాటు హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, పారా గ్లైడింగ్‌ వంటివి ఏర్పాటు చేయాలని చెప్పారు. డిగ్రీ కళాశాల మైదానం పక్కనే ఉన్న టీడబ్ల్యూ రవ్వలగుడ బాలుర ఆశ్రమోన్నత పాఠశాల ప్రాంగణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పాణిరంగిని నుంచి అరకు వరకు హైవే మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించాలని, పట్టణ పరిధిలోని రహదారులను ఉత్సవ్‌ ప్రారంభం రోజుతో పాటు ముగించే వరకు వినియోగించుకోవాలని సూచించారు. పట్టణమంతా శుభ్రంగా ఉండాలని, ఎక్కడా ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కనిపించకూడదన్నారు. పారిశుధ్య పనులు సంపూర్ణంగా జరగాలని, ఇది డీపీవో, డీఎల్‌పీవో, ఎంపీడీవోలదే బాధ్యత అని చెప్పారు. వీవీఐపీలు, వీఐపీలు, మంత్రుల వాహనాల రాకపోకలు, పార్కింగ్‌, ఇతర సందర్శకుల వాహనాల పార్కింగ్‌పై పోలీసులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించే తుర్రాయిగుడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ముఖ్యమంత్రి సందర్శించే హోం స్టేలను సిద్ధం చేయాలని, కాఫీ తోటల పరిశీలనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి సందర్శించే ప్రాంతాలివే..

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెలికాప్టర్‌ దిగగానే చినలబుడు పంచాయతీ తుర్రాయిగుడ గ్రామంలో పర్యటించి హోం స్టేలను పరిశీలిస్తారని కలెక్టర్‌ తెలిపారు. అక్కడ గిరిజన వంటకాలు, వంటశాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం కాఫీ తోటలను పరిశీలిస్తారన్నారు. తుర్రాయిగుడ గ్రామం నుంచి గిరిజన మ్యూజియానికి, అక్కడ నుంచి కాఫీ మ్యూజియానికి వెళతారన్నారు. గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసే కార్నివాల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం ఉత్సవ్‌ ప్రధాన వేదిక అయిన డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుంటారన్నారు. మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, కారవాన్‌ టూరిజానికి సంబంధించిన బస్సును సీఎం పరిశీలిస్తారన్నారు. తరువాత సందర్శకులను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పారు.

గిరిజన మ్యూజియాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో

గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఐటీడీఏ పీవో శ్రీపూజ పరిశీలించారు. మ్యూజియంలో చేయాల్సిన ఏర్పాట్లపై మ్యూజియం మేనేజర్‌ గణపతికి సూచనలు చేశారు. ఆమె వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాకిత్‌, మ్యూజియం పూర్వపు మేనేజర్‌ మురళి, టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:45 PM